Apr 25,2023 01:13
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన కార్యక్రమంలో వచ్చిన రీ ఓపెన్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్పందన రీ ఓపెన్‌ కేసులు 60 దాకా ఉన్నాయని రెండు రోజుల్లో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 11 నెలలు గడుస్తున్నా స్పందన రీ ఓపెన్‌ కేసుల పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ సిపిఓ, డిపిఓపై అసహనం వ్యక్తం చేశారు. స్పందన అర్జీలు పరిష్కరించడానికి ప్రతి శాఖకు సంబంధించిన 10 అర్జీలను పరిశీలించి పరిష్కరించడానికి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోసీజర్‌ను తయారు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత ఎక్కువ గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం పూట త్వరగా పనులకు వెళ్లి తీవ్ర వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్‌ కిట్స్‌ కూలీలకు అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కిరోసిన్‌ ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. గ్రామాల్లో దోమల వల్ల అంటువ్యాధులు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా 13 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. 13 మంది గ్రామ సర్పంచ్‌లను జిల్లా కలెక్టర్‌ శాలువాలతో సన్మానించారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి శివ జ్యోతి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ అర్జున్‌, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శంకర్‌ నాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌, పశుసంవర్థక శాఖ జెడి హనుమంతరావు, మత్స్యశాఖ జెడి సురేష్‌, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్‌ సత్తార్‌, డిఎస్‌ఓ విలియమ్స్‌, డిఎం శ్రీలక్ష్మి, డిఎంహెచ్‌ఓ విజయమ్మ పాల్గొన్నారు.