Jul 26,2023 20:49

- రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం


సిఎం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఇష్టారాజ్యం
ఇ-పోస్టింగ్స్‌ పేరుతో బదిలీలు, ఉద్యోగోన్నతులు
30 రోజులుగా ఆర్‌డి విధులకు గైర్హాజర్‌
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-4 రీజినల్‌ డైరెక్టర్‌ పోస్టుకు రెగ్యులర్‌ అధికారి నియామకం కొరవడింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని రీజినల్‌ డైరెక్టర్‌ పోస్టుకు రెగ్యులర్‌ అధికారి నియామకానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని నాలుగు జోన్లలో జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3 రీజినల్‌ డైరెక్టర్లు బదిలీలు, పదోన్నతులు, కౌన్సెలింగ్‌ వంటి పాలనాపరమైన అంశాల్లో సమర్థ వంతంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ జోన్‌-4 రీజియన్‌కు రెగ్యులర్‌ అధికారి కొరవడిన నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన స్టాఫ్‌నర్సుల పోస్టింగ్స్‌ మొదలుకుని ఎంపిహెచ్‌ఎస్‌, ఎంపిహెచ్‌ఒ పోస్టింగ్స్‌, ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన బదిలీలు, పదోన్నతులు, తాజాగా మరో 313 స్టాఫ్‌నర్స్‌ రిక్రూట్‌మెంట్‌ వరకు వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల నేప థ్యంలో గత మే మాసం నాలుగో వారం నుంచి నేటి వరకు జోన్‌-4 రీజియన్‌లో రెగ్యులర్‌ స్థాయి రీజినల్‌ డైరెక్టర్‌ లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నుంచి అనిల్‌కుమార్‌ అనే డైరెక్టర్‌ను అదనపు అధికారిగా నియమించారు. ఆయన జులై మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నారు. జులై 19, 20, 21 తేదీల్లో జోన్‌-4 పరిధిలోని సుమారు మూడు నుంచి ఐదు వేల మంది అధికారుల బదిలీల సమయంలో విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు జిల్లా వైపు తొంగిచూడడం లేదనే విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది మే నెల చివరి వారం వరకు రెగ్యులర్‌ రీజినల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కోటేశ్వరి విదులు నిర్వహిస్తుండేవారు. ఆమె పదోన్నతిపై విజయవాడకు వెళ్లినప్పటి నుంచి రెగ్యులర్‌ అధికారి నియామకానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆర్‌డి కార్యాలయ అధికారులు ఈ-పోస్టింగ్‌ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి ముగ్గురికి బదిలీలు, నలుగురికి పదోన్నతులకు అవకాశం కల్పించారనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. రీజినల్‌ డైరెక్టర్‌ పూర్తి స్థాయిలో సంబంధిత ఫైళ్లను పరిశీలించకుండా బదిలీలు చేయడ మేమిటనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా 313 స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ నెల 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వ హించాల్సి ఉంది. ఈమేరకు ఆర్‌డి కార్యాలయ అధికారులు డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఏర్పాట్లు చేశారు. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన స్టాఫ్‌నర్స్‌ల కౌన్సెలింగ్‌లో క్షుణ్నంగా సర్టి ఫికెట్లను పరిశీలనలో దొర్లిన పొరపాట్ల కారణంగా బోగస్‌ సర్టిఫికెట్ల వివాదం తలెత్తింది. అప్పట్లో సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేయడం, కేసు నమోదు వంటి ఘటనలు చోటుచేసుకున్న సంఘటన తెలి సిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ అధికారిని నియమించని పక్షంలో బదిలీలు దగ్గర నుంచి పదోన్నతులు, కౌన్సెలింగ్‌ వంటి అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందనడంలో సందేహం లేదు. సంబంధిత రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు రెగ్యులర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ను నియమించాలనే వాదన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. దీనిపై సంబంధిత సూపరింటెండెంట్‌ స్థాయి అధి కారిని ఆరా తీయగా 10 రోజులకు ఒకసారి విజయవాడకు ఫైళ్లను తీసుకెళ్తున్నామని పేర్కొనడం గమనార్హం.