Jul 20,2022 00:25

సిజిఎం శ్రీధర్‌తో సమావేశమైన సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ఆవరణలో రీబార్‌ మిల్‌ నిర్మించుకొని ఉత్పత్తి చేసుకునేందుకు ప్రయివేటు వారికి అవకాశమిస్తూ యాజమాన్యం ప్రకటించిన టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్టీల్‌ ప్లాంట్‌ సిజిఎం శ్రీధర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ భూములను ప్రైవేటు వారికి అప్పగించి ప్రత్యేకంగా రీబార్‌ మిల్‌ నిర్మించుకుని లాభాలు పోగేసుకొనేందుకు ప్లాంట్‌ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలకు స్వస్తి చెప్పకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అత్యంత లాభదాయకమైన రీబార్‌ మిల్‌ను స్టీల్‌ యాజమాన్యమే నిర్మించాలని కోరారు. ప్రజాధనంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించి లాభదాయకమైన ఫినిష్ట్‌ స్టీల్‌ తయారు చేసేందుకు ప్రయివేటు వ్యక్తులకు అవకాశం ఇవ్వడమంటే నష్టాలు ప్రభుత్వ రంగానికి కట్టబెట్టి, లాభాలు ప్రయివేట్‌ వారికి అప్పగించడమేనని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఏ విధంగానైనా ముక్కలు చేసి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌ను ప్రయివేటుకు అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ విధానాన్ని విడనాడాలని డిమాండ్‌చేశారు. తక్షణమే బూ ప్రాతిపదికన రీ బార్‌ మిల్‌ నిర్మాణానికి ఇచ్చిన టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైటి.దాస్‌, యు.వెంకటేశ్వర్లు, రామస్వామి, మురళి, కెఆర్‌కె రాజు, సత్యనారాయణ, టీవీకే రాజు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.