Sep 06,2023 22:44

కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం

            స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా చేపడుతున్న రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను బాధ్యతాయుతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. స్థానిక వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ పి.ప్రశాంతి స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా చేపడుతున్న రీ వెరిఫికేషన్‌ ప్రక్రియపై ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, ఎన్నికల సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు 2022 జనవరి ఆరో తేదీ నుంచి 2023 ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు వచ్చిన తొలగింపులను మరోసారి తిరిగి పరిశీలించాలన్నారు. బిఎల్‌ఒలు నూటికి నూరు శాతం తిరిగి పరిశీలన చేయాలన్నారు. రీ వెరిఫికేషన్‌లో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇఆర్‌ఒలు వెయ్యి క్లయిమ్స్‌ పరిశీలించాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్‌ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని, ప్రత్యేక అధికారులు 500 క్లయిములు రీ వెరిఫికేషన్‌ చేయాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రతి నియోజకవర్గానికి వంద క్లయిములు పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుందని, ఈ నెల ఏడో తేదీ నాటికి రీ వెరిఫికేషన్‌ పూర్తవుతందని తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఓటు హక్కు తొలగించరాదని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు. రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒల ద్వారా మానిటర్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి పోలీస్‌స్టేషన్‌ వారీగా రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఆగస్టులో ఇంటింటికీ సర్వే పూర్తి చేసుకున్నామని, కొత్తగా ఎవరైతే 18 ఏళ్లు నిండినవారికి మొదటిసారి ఓటు హక్కు కల్పించడం, అర్హత ఉన్నవారు ఎక్కడైనా ఓటర్‌ నమోదు కాకపోయి ఉంటే వాళ్లందరినీ గుర్తించి బిఎల్‌ఒలు ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియ గురించి వివరంగా తెలియజేయాలన్నారు. వారి వద్ద నుంచి ఫామ్‌-6 క్లయిమ్స్‌ తీసుకోవడం, ఎక్కడైనా చనిపోయిన, షిఫ్ట్‌ అయినా ఓటర్లు వారి వివరాలను ఫామ్‌-7లో తీసుకుని పూర్తిగా పరిశీలించి చనిపోయిన వారి ఓటు తొలగించడం, శాశ్వతంగా మైగ్రేట్‌, షిఫ్ట్‌ అయిన వారి వివరాలు, మార్పులు, సవరణలు ఫామ్‌-8 తీసుకుని చేసే ప్రక్రియలను పూర్తి చేసినట్లు తెలిపారు. బిఎల్‌ఒలు ఇంటింటికి వెళ్లి మొత్తం ఓటర్‌ జాబితాను మరోసారి పరిశీలించి తీసుకున్న క్లయిమ్స్‌ను పరిశీలించి ఇఆర్‌ఒలు వారి లాగిన్‌ల నుంచి పరిశీలించి వాటన్నిటిని అప్రూవల్‌ చేసి వెంటనే డిస్పోస్‌ చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఇఆర్‌ఒలు, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.