
ప్రజాశక్తి-సబ్బవరం
రాష్ట్రంలో చేపడుతున్న భూముల సమగ్ర రీ సర్వేపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టితో కలిసి ఆయన సబ్బవరం మండలం అయ్యన్నపాలెం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. రోవర్స్‌తో స్టోన్ ప్లాంటేషన్ (సర్వే రాళ్లు వేయడం) ట్యాగ్ మార్కింగ్, అక్షాంశ, రేఖాంశాలను అనుసరించి భూమి సరిహద్దులను, సరిహద్దు రాళ్ళను గుర్తించడం, కొలతల ప్రకారం పొలం విస్తీర్ణం గుర్తించడం వంటి పనులను పరిశీలించారు. రీ సర్వే గురించి, అధికారులు ఏ విధంగా చేస్తున్నారు, దీని మూలంగా లాభం ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పట్ల రైతులు సానుకూలంగా స్పందించారు. పొలం సరిహద్దులు స్పష్టంగా తెలుస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో చేపట్టిన రీ సర్వే మూలంగా స్పష్టమైన మ్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. దీనివల్ల భూ సరిహద్దు సమస్యలు పూర్తిగా సమసిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, నర్సీపట్నం, అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ, జయరాం, తహశీల్దార్ బి. సత్యనారాయణ, మండల సర్వేయర్ కె. శ్రీనివాసరావు, ఆర్‌ఐ వీరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.