ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు, జెఎసి అమరావతి ఛైర్మన్ వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
భూ-రీసర్వేపై రెవెన్యూ అధికారులను ఒత్తిడి చేయడం వల్ల సర్వే వివరాలు తప్పులతడకగా మారే అవకాశాలున్నాయని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఏలూరులోని నూతనంగా ఆధునికీకరించిన రెవెన్యూ సమావేశ మందిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందని, ఈ విషయంలో తాము 24 గంటలూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ దానికి ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. రీ సర్వేలో తప్పులు వస్తే భవిష్యత్‌లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ప్రతీ గ్రామాన్ని యూనిట్‌గా ఎంపిక చేయడం భావ్యం కాదన్నారు. ఓ గ్రామంలో వందల ఎకరాలు ఉంటే మరో గ్రామంలో వేలాది ఎకరాలు భూములుంటాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రతి గ్రామానికీ 30 రోజులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రీసర్వే వల్ల రెవెన్యూ శాఖకు మంచి పేరు వస్తుందని, అలాంటి దాంట్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. రీసర్వే ఒత్తిడి వల్ల ముగ్గురు విఆర్‌ఒలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. విఆర్‌ఒలు ఆత్మహత్యల వైపు కన్నెత్తి చూడొద్దని, ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రీసర్వేకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదన్నారు. అలాంటప్పుడు ఎలా చేపట్టగలమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకూ పది లక్షల మంది ఉద్యోగులు డిఎ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ విషయంపై సిఎం జగన్ స్పందించాలని కోరారు. ఉద్యోగులు ప్రతినెలా వేతనం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని, ఒకటో తేదీన వేతనం వస్తుందనే విషయమే మర్చిపోయారన్నారు. పింఛనుదారులు కూడా నెలాఖరు వరకూ ఎదురుచూసే పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌వి.రాజేష్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.కృష్ణమూర్తి, స్టేట్ సెక్రటరీ జనరల్ వైవి.రావు, జిల్లా అధ్యక్షులు కె.రమేష్ కుమార్, కార్యదర్శి ఎ.ప్రమోద్ పాల్గొన్నారు.










