
రీ సర్వేను వేగవంతం చేయండి
- రెవెన్యూ అంశాల లక్ష్యాన్ని చేధించాలి
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్ని మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రీ సర్వే, స్పందన గ్రీవెన్స్, ఆర్‌ఒఆర్ కేసులు, ఎపిసేవా సర్వీసులు, మ్యుటేషన్ సేవలు, భూ సేకరణ, పరాయీకరణ, వ్యవసాయ భూముల కేటాయింపు, ఇనామ్ సర్వీస్ భూములు, పౌరసరఫరాలు, కోర్టు కేసులు తదితర నిర్దేశిత రెవెన్యూ లక్ష్యాల సాధనపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబంధించి స్పందన కార్యక్రమంలో అనేక దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత తహశీల్దారులు, విఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆర్‌ఓఆర్ పెండింగ్ కేసులు, క్షేత్రస్థాయిలో అనుభవంలో ఉన్న కేసులను విశ్లేషించి మండలాల వారీగా వారం రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లకు సూచించారు. సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు నిర్దేశించిన రీ సర్వే కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిశితంగా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. సర్వే బృందాలు గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, స్టోన్ ప్లాంటేషన్ తదితర ప్రక్రియలను ఆర్డీవోలు పరిశీలించాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మ్యుటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్‌ఎల్‌ఎ లోకి వెళ్తున్నాయని పలుమార్లు సూచించినప్పటికీ సంబంధిత తహశీల్దారులు, వీఆర్వోలు అశ్రద్ధ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్న గ్రామాల అవార్డ్స్‌ను పాస్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి నిత్యవసర సరుకుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ పుల్లయ్య, సంబంధిత డివిజన్, మండలాల ఆర్డీవోలు, తహశీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.