
ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం చందక పంచాయతీ జగ్గరాజుపాలెం గ్రామంలో శనివారం దక్షిణ భారతదేశ భూ సర్వే బృందం పర్యటించింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో బృంద సభ్యులు మాట్లాడారు. భూ సర్వే వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులనడిగి తెలుసుకున్నారు. దేశంలో మొదటిసారిగా రీ సర్వే ఆంధ్రాలో ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనందపురం మండలంలో 26 పంచాయతీలకుగానూ 16 పంచాయతీల్లో రిసర్వే పూర్తయిందని తహశీల్దార్ లోకవరపు రామారావు బృంద సభ్యులకు వివరించారు. సర్వేకు సాటిలైట్ సిగల్ 5 పాయింట్లు కావాల్సి ఉండగా మండలంలో 32 పాయింట్లు వరకు సిగల్ ఉండడంతో సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, సెంట్రల్ టీమ్ సుమారు 37 మంది ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక అధికారులైన భీమిలి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, విఆర్‌ఒలు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.