* వేగవంతం చేయకుంటే విధుల నుంచి తప్పుకోండి
* లోపాలను పునరావృతం కానీయొద్దు
* జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: సమగ్ర భూ రీ సర్వే పనులను సక్రమంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఆదిత్య కళ్యాణ మండపంలో రీ సర్వే పనులపై టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 17 మండలాల తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, విఆర్‌ఒలు, రెవెన్యూ సిబ్బందితో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రీ సర్వేలో నిర్లక్ష్యం తగదన్నారు. కొన్ని మండలాల్లో సర్వే పనుల్లో ఎందుకు జాప్యమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చేపట్టిన రీసర్వే పనుల్లో మండలాల వారీగా ఎంతమేరకు పూర్తి చేశారో చెప్పాలని ఆదేశించారు. సర్వే సమయంలో భూ హక్కుదారులను పిలవకుండా చేయడం వల్ల అపోహలకు దారితీస్తుందన్నారు. గ్రామ సచివాలయం పరిదిలో సర్వే చేపడుతున్నప్పుడు విఆర్‌ఒ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి విడత సర్వే శతశాతం పూర్తి చేసిన సిబ్బంది గతంలో ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా రెండో విడత రీ సర్వే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండో విడత రీ సర్వే పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లేకుంటే విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. ఇప్పటివరకు చేపట్టిన రీ సర్వేలో ఉన్న లోటుపాట్లను గమనించి ఇకపై ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రీ సర్వే పనులు నత్తనడకన నడుస్తున్న మండలాల్లో సర్వేయర్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాసుపుస్తకాల జారీ, స్టోన్ ప్లాంటేషన్ పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డిఒ టి.సీతారామ్మూర్తి, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










