Nov 16,2023 00:38
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న తాసిల్దార్‌ పద్మావతి

ప్రజాశక్తి - పంగులూరు: మండలంలోని రేణింగివరం, కస్యాపురం గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతుందని, ఈ సర్వేకు ఆటంకంగా ఉన్న సుబాబుల్‌ తోటలను తొలగించి రైతులు సహకరించాలని తహశీల్దారు పద్మావతి కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. భూముల రీ సర్వేకు సుబాబుల్‌ తోటలు అడ్డుగా ఉన్నాయని అన్నారు. దీనివలన రీ సర్వే చేయడం కష్టంగా ఉందని తెలిపారు. సుబాబుల్‌ తోటలను తొలగిస్తే రీ సర్వే త్వరగా పూర్తిచేసి రైతులకు పాస్‌ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. రేణింగవరం, కస్యాపురం, జాగర్లమూడి వారి పాలెం గ్రామాల రైతులకు నోటీసులు కూడా ఇచ్చామని చెప్పారు. సుబాబుల్‌ తోటలను తొలగించకపోతే రీసర్వే ఆగిపోతుందని అన్నారు. దానివలన రైతులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం ఆలస్యం అవుతుందని అన్నారు. రైతులకు బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వరని చెప్పారు. తూర్పు కొప్పెరపాడు విఆర్‌ఓ ఎవరని ఆ గ్రామ సర్పంచి ప్రశ్నించారు. చిన్న అంజయ్యను తూర్పుకొప్పెరపాడు గ్రామానికి వీఆర్వోగా నియమించామని తహశీల్దారు తెలిపారు. ఎఒ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వకపోతే భూ యజమానులకు ఇస్తామని తెలిపారు. కౌలు రైతుకి ఇస్తే రైతుకు ఇవ్వమని చెప్పారు. కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు విషయమై త్వరలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేస్తారని అన్నారు. మినీ ట్రాక్టర్లు 40 శాతం సబ్సిడీపై ఇస్తున్నట్లు హార్టికల్చర్‌ శాఖ బాధ్యులు తెలిపారు. మినీ ట్రాక్టర్‌ ధర రూ.3లక్షల అవుతుందన్నారు. ప్రతి పదివేల లీటర్లు నీటికి 100 గ్రాములు బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాలని ఆర్డబ్ల్యూఎస్‌ ఎఈ శివయ్య తెలిపారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇచ్చే కులాయి కలెక్షన్లు ఉచితమని తెలిపారు. ఎవరు డబ్బులు చెల్లించవద్దని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఇప్పటికీ ఎవరైనా కట్టకపోతే త్వరలో కట్టుకోవాలని సూచించారు. ఒక్కో దానికి రూ.10వేలు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా ఇస్తారని అన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా మండలంలో రూ.11.69కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వలన టెండర్లు ఆగిపోయాయని తెలిపారు. ఈ కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ శివ చెన్నయ్య కోరారు. ఇటీవల జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజలంతా ఎంతో సహకరించారని చెప్పారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎఈ విశ్వ మోహన్‌ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండటం వలన ఈ సంవత్సరం తాగునీటికి మాత్రమే నీరు ఇస్తామని చెప్పారు. ప్రజలు సాగర్‌ నీటిని తాగునీటి చెరువులకు నింపుకోవాలని కోరారు. ఎంపీడీఒ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అధికారులు కూడా ఎక్కడ అవినీతికి పాల్పడకుండా నిస్పక్షపాతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తేళ్ల నాగమ్మ, జడ్పిటిసి రాయిని ప్రమీల, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి, మండల అభివద్ధి కమిటీ అధ్యక్షుడు రాయిని వెంకట సుబ్బారావు, మండల కో ఆప్షన్‌ నెంబరు కాసిం ఖాన్‌ పాల్గొన్నారు.