
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
ప్రణాళిక బద్ధంగా భూముల రీ సర్వే నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో శాశ్వత భూ హక్కు భూ రక్షణపై తహశీల్దార్, డిటి, మండల సర్వేయర్లు, విఆర్‌ఒలకు, విలేజ్ సర్వేయర్లకు ఒక రోజు వర్క్‌షాపు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రీ సర్వేలో రైతులు భాగస్వాములుగా ఉండాలన్నారు. శాటిలైట్ బేస్‌తో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, నరసాపురం ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ కె.కృష్ణవేణి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా పాల్గొన్నారు.
రీ సర్వేతో ఎన్నో ఉపయోగాలు
పాలకోడేరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గొల్లలకోడేరు పంచాయతీ ఉపసర్పంచి కలిదిండి శ్రీనివాస్‌వర్మ అన్నారు. గొల్లలకోడేరులో ఇటీవల రీ సర్వే పూర్తి కావడంతో సరిహద్దుల్లో సర్వే రాళ్లను భూమిలో పాతే కార్యక్రమాన్ని మంగళవారం శ్రీనివాస్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. సుమారు వందేళ్ల క్రితం రీ సర్వే జరిగిందని, అప్పటినుంచి ఏ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ వేండ్ర, వేండ్ర అగ్రహారం, పాలకోడేరు, గొరగనముడి, గొల్లలకోడేరు గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందన్నారు. వేండ్ర మినహా మిగిలిన గ్రామాలకు సర్వే రాళ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని సరిహద్దుల్లో పాతే కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ ఇందిర, గ్రామ సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు.