- విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు
- సవరణకు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
భూ వివాదాల పరిష్కారానికి జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ముందుగా ఫ్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్‌స (పిఒఎల్‌ఆర్) పూర్తి చేసి గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ రీసర్వేలో కొత్త చిక్కులు వస్తున్నాయని భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక మొదటి, రెండు దశల రీ సర్వేల్లో లోపాల సవరణకు భూ యజమానులు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గుడివాడ మండలం బొమ్ములూరు రెవెన్యూ గ్రామంలో అట్లూరి శేషగిరిశైలు కుటుంబానికి 5.91 ఎకరాల విస్తీర్ణంలో కొంత భాగం వ్యవసాయ భూమి, మరికొంత భాగంలో చెరువు ఉంది. భూ యజమానులకు సంబంధించి ఎఫ్‌ఎంబి, పాస్‌బుక్, ఆర్‌ఒఆర్, అడంగల్ అన్నీట్లో ఈ విస్తీర్ణం ఉంది. రీ సర్వే తర్వాత రికార్డుల్లో 70 సెంట్లు కనిపించకుండా పోయింది. ఇదే గ్రామంలో మరో పది మంది రైతులు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత నోటీసులు ఇవ్వాలి. కానీ భూమి వివరాలతో కూడిన నోటీసులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత అనేక గ్రామాల్లో భూ యజమానులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బొమ్ములూరుకు సంబంధించి భూములను రెండో దశలో రీ సర్వే నిర్వహించారు. కొందరు భూ యజమానులకు నోటీసులిచ్చి దీనికన్నా ముందుగా మొదటి దశలో రీ సర్వే నిర్వహించిన బందరు మండలం పొట్లపాలెంలోనూ భూ యజమానులు పలు సమస్యలు ఎదుర్కొంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లాలో రీ సర్వే ఇలా
ముందుగా ఫూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సు పూర్తి చేసిన గ్రామాల్లో రీ సర్వే నిర్వహించాలి. సంబంధిత భూ యజమానులకు సర్వే నిర్వహించే క్రమంలో నోటీసులు ఇవ్వాలి. రీ సర్వే పరిశీలనకు అవకాశం కల్పించాలి. కొన్ని గ్రామాల్లో భూ యజమానులకు నోటీసులు ఇస్తున్నా, మరికొన్ని గ్రామాల్ల్లో ఇవ్వడం లేదు. డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆర్ధోరిక్టిఫై ఇమేజ్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ఇమేజ్‌లకు అనుగుణంగా గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుడేషన్ ప్రక్రియల్లో రికార్డుల్లోని విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉంటోంది. దీనిపై భూ యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈసమస్య పరిష్కారానికి మొబైల్ కోర్టును ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే ఈ కోర్టుపై అవగాహన లేకపోవడంతో భూ యజమానులు ఎక్కువగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో మొదటి దశలో 17 గ్రామాలు, రెండో దశలో 83 గ్రామాలు మొత్తం 100 గ్రామాల్లో 77,126 ఎకరాల భూములకు సంబంధించి అక్టోబర్లో రీ సర్వే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి 94 గ్రామాల్లోని 68,451 ఎకరాల్లో రీ సర్వే పూర్తయింది. ఈ రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి 13 నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన గ్రామాల్లో రీ సర్వే పూర్తికి రెవెన్యూ రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నారు.










