ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి -రంపచోడవరం
ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర భూ రీ సర్వే ద్వారా భూముల సరిహద్దులను గుర్తించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే అన్నారు. శనివారం మండలంలోని నల్లగొండ గ్రామంలో రీ సర్వేను రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు, ప్రైవేట్ భూములకు రీ సర్వే చేసి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి సరిహద్దులు చూపించడం జరుగుతుందని చెప్పారు. నల్లగొండ గ్రామంలో రెండు సర్వే టీంలు, 9 మంది సర్వేయర్లతో ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. సర్వేలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్వేయర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్ కె.దేవేంద్రుడు, తహశీల్దారు పిఎన్‌వి.ప్రసాద్, సర్వేయర్లు, వీఆర్వోలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










