Nov 02,2022 22:31

ప్రజాశక్తి - ఏలూరు
               వైద్య, ఆరోగ్య శాఖలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌లో భాగంగా చేపడుతున్న హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌ సిబ్బంది రీ డిప్లాయిమెంట్‌ను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డిఎన్‌విడి.ప్రసాద్‌, సయ్యద్‌ జఫ్రుల్లా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు సీనియారిటీ జాబితాపై పలు సందేహాలను జిల్లా అధికారి వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కొంతమంది తప్పుడు మెడికల్‌, స్పవూజ్‌ సర్టిఫికెట్లు పెడుతున్నారని, దీనికి సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌లను ప్రస్తుతం పని చేస్తున్న సబ్‌ సెంటర్ల పరిధిలో ఉన్న సచివాలయాలకు మ్యాపింగ్‌ చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో బదిలీలు కోరుకునే హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌లకు పరస్పర, ఐచ్ఛిక బదిలీలు నిర్వహించటం ద్వారా న్యాయం చేయాలన్నారు. జిల్లాలో సచివాలయాలను మ్యాపింగ్‌ చేసిన క్లస్టర్ల జాబితాను సీనియారిటీ లిస్టుతో పాటు ఉద్యోగులకు అందించాలని కోరారు.