
ప్రజాస్వామ్యాన్ని దాని జీవనాధారమైన భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కడం మోడీ పాలనలో కొత్తేమీ కాదు. భారత దేశాన్ని హిందుత్వ-ఫాసిస్ట్ నియంతృత్వం లోకి వేగంగా లాగడం, దానిని వ్యతిరేకించే వారిని అణిచి వేయడం నిరంతర ఎత్తుగడగా వుంది. మంగళవారం ఢిల్లీలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు తాజా ఉదాహరణ. ఢిల్లీ పోలీసులు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసం, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కార్యాలయం, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు.
ప్రభుత్వ ఫాసిస్టు ఎత్తుగడలను ఎదిరించి మానవ హక్కుల కోసం పోరాడిన అనేక మందిని...మోడీ పాలనలో తప్పుడు కేసులు బనాయించి, దేశద్రోహ నేరారోపణలు చేసి జైలుకు పంపారు. ఆదివాసీల్లో మానవ హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి నుంచి, కర్ణాటకకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశా రవి, మలయాళీ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ తదితరులు ఈ జాబితాలో వున్నారు. బిజెపి ప్రభుత్వ విమర్శకులను దేశద్రోహులుగా చిత్రీకరించి జైలుకు పంపడం పరిపాటిగా వుంది. చారిత్రాత్మక రైతాంగ సమ్మెకు మద్దతు ఇచ్చినందుకు దిశా రవిని అరెస్టు చేశారు. 'రైతుల సమ్మె కవర్ చేయబడిందా?' అనేది 'న్యూస్ క్లిక్' జర్నలిస్టులకు వేసిన ఒక కీలకమైన ప్రశ్న.
ఢిల్లీలో జరిగిన తాజా అరెస్టులు పైన పేర్కొన్న సంఘటనలకు కొనసాగింపుగా చోటుచేసుకున్నవే. దేశంలో స్వేచ్ఛాయుత మీడియా కార్యకలాపాలను లేకుండా చేసేందుకు ఈ విధమైన ఉగ్రవాదానికి తెరలేపారు. ఇది భారతదేశంలోని మీడియా స్వేచ్ఛ యొక్క వాస్తవ స్థితిని వెల్లడిస్తుంది. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి. స్వతంత్ర మీడియాను భయపెట్టడమే దీని లక్ష్యం. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, నేరుగా హోంమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉంది. న్యూస్ క్లిక్‌కు సంబంధించిన దాదాపు 30 చోట్ల దాడులు నిర్వహించింది. చైనా నుంచి నిధులు అందుతున్నాయని ఆ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో దాడులు చేసింది. దీంతో పాటు 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (యుఎపిఎ-ఉపా) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దానికి కొనసాగింపుగానే ప్రస్తుత దాడి అంటున్నారు. కానీ, వారు చేసిన నేరం ఏమిటో? ఏ అంశాల మీద దర్యాప్తు చేస్తారో? స్పష్టంగా తెలియలేదు. సిపిఎం ప్రధాన కార్యదర్శి హోదాలో కేంద్రం కేటాయించిన కానింగ్ రోడ్డులోని సీతారాం ఏచూరి అధికారిక నివాసంపైనా దాడి జరిగింది. కిసాన్‌సభ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. జాతీయ పార్టీల ముఖ్య కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తారు. ఏచూరి ఇంటిపై జరిగిన దాడి కూడా న్యూస్ క్లిక్‌కి సంబంధించినది. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, జర్నలిస్టులు అభిసార్ శర్మ, ఎ. చక్రవర్తి, భాషా సింగ్, సుమేధాపాల్, అరిత్రి దాస్‌ల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇంత మంది జర్నలిస్టుల నివాసాలు, కార్యాలయాల్లోకి చొరబడి కనపడినవన్నీ ఎత్తుకెళ్లడం ఇదే తొలిసారి.
కార్పొరేట్ మీడియా మోడీ విధానాలకు పెద్దపీట వేసింది. సూత్రప్రాయంగా, నిజాయితీగా వ్యవహరించే వారు స్వతంత్రంగా పని చేయలేని పరిస్థితి. బిజెపిపై విమర్శలు గుప్పించిన 'ది టెలిగ్రాఫ్' వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్.రాజగోపాల్ మరుసటి రోజు ఆ పదవి నుండి తొలగించబడ్డారు. నిజాయితీపరులైన జర్నలిస్టులు తప్పుడు కేసులు, అరెస్టులు, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. మోడీ పాలనలో గౌరీ లంకేష్ లాంటి వారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా, రాజ్యాంగం హామీ ఇచ్చిన పత్రికా స్వేచ్ఛ పూర్తిగా ప్రమాదంలో పడింది. పత్రికా స్వేచ్ఛ విషయంలో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానంలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచు కోవాలి. తీవ్ర సవాళ్ల మధ్య కూడా వాస్తవాలను వెల్లడి చేస్తూ ముందుకు సాగుతున్న నిజమైన జర్నలిస్టులు, మీడియా వ్యక్తులు మన మధ్య ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడే వారు కార్పొరేట్ మీడియా తప్పుడు పోకడల కారణంగా ప్రమాదంలో పడుతున్నారు. మోడీ ప్రభుత్వం ఇటువంటి స్వతంత్ర పత్రికా కార్యకలాపాలను సహించదని ఢిల్లీలో 'న్యూస్ క్లిక్'పై జరిగిన సామూహిక దాడి స్పష్టం చేస్తోంది. మోడీ, మిత్ర బృందం ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ద్వేషిస్తున్నారనడానికి నిదర్శనమే ఈ అరెస్టులు.
('దేశాభిమాని' సంపాదకీయం)