Nov 28,2021 13:25

గాలి మోసుకొచ్చిన రహస్యాన్ని
పెరటి చెట్లన్నీ వింటూ
వేర్లను ఊడదీసుకుని
ఎగిరిపోవాలన్నంత సంబరంతో
ఊగిపోవడం
నా కళ్ళకు కొత్త కాంతులు అద్దుకుంటాయి

మేఘాలు సంఘర్షణ పడుతూ
భూమిని హత్తుకోవాలని
ఉవ్విళ్ళూరుతుంటే
రహస్య స్వరాలను
మనసులో ప్రోదిచేసుకుంటూ
నేను విశ్వమంత
నన్నుగా విస్తరించుకుంటాను

పగలు రేయీ
వీడ్కోలు చెప్పుకుంటున్నప్పుడు
నేను మనసుని విసిరి
వాటి మధ్య ఏదైనా రహస్యం ఉందేమోనని
వెదుకుతూ వెదుకుతూ
కాలం చేయి పట్టుకుంటుంటాను

నాన్న
పంట చేనుతో మాట్లాడుతున్నప్పుడు
వాళ్ళిద్దరి మధ్యా
కనిపించని సంభాషణలోని
రహస్యం కోసం
నాన్న పాద ముద్రలలో
నా పాదాలు పేర్చుకుంటూ
వెదుకుతూనే ఉన్నాను

అన్న
కర్మాగారానికి వేలాడేసిన
త్యాగంలోని రహస్యం
హీన స్థితికి చేరిన కార్మికుల
జీవితాలకు ఇంజెక్ట్‌ చేసి
ఆత్మస్థైర్యం నూరిపోతకు
గుండెను విసిరి మరీ ఎగురుతూనే ఉన్నాను

ఎక్కడా
పగిలిన రహస్యం కనిపించక
మనసును నిలబెట్టుకునే
కేలెండర్లు తిరగేస్తూనే ఉన్నాను

కొత్తపల్లి మణీత్రినాథరాజు
99493 89296