ప్రజాశక్తి-అనంతగిరి:సాగులో ఉన్న రైతుల భూములను విజయనగరం జమీందారుల రాజులు తమవి అంటూ స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి రహస్య సర్వేలు నిర్వహిస్తున్న బృందాన్ని స్థానిక జెడ్పిటిసి దీసరి గంగరాజు, టోకురు సర్పంచ్ కిల్లో మొస్య ఆధ్వర్యాన మంగళవారం టోకూరు పంచాయతీ ములియాగుడ గ్రామం వద్ద అడ్డగించారు. అనంతగిరి, టోకూరు, ఎగువశోభ పంచాయతీ గ్రామాల సాగు రైతులు ఇక్కడ నుండి వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రం కార్యాలయంలో గిరిజన సంఘం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ తహాసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. తమ సాగు భూములు తమకే చెందాలని, జమిందార్ రాజులమని భూమి జోలికి వస్తే తరిమి కొడతామని నినాదాలు చేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయమై తహాసిల్దార్‌ని నిలదీశారు. అనంతరం లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి. గంగరాజు మాట్లాడుతూ, కొండిభ, టోకురు, అనంతగిరి, ఎగువశోభ పంచాయతీ పరిధిలోని అరకు రోడ్డుకు ఆనుకొని పూర్వకాలం నుండి రైతుల సాగులో ఉన్నాయన్నారు.విజయనగరం జమీందారుల రాజులమని కొంతమంది వారికి చెందిన భూములు ఉన్నాయని స్థానిక రెవిన్యూ అధికారుల అండదండలతోసర్వే నిర్వహించడం సరికాదన్నారు. 1970 సంవత్సరం ముందు జమిందార్ రాజుల పరిపాలన కొనసాగిందని, అనంతరం ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయారన్నారు. గిరిజన ప్రాంతంలో 1/70, పీసా వంటి చట్టాలకు విరుద్ధంగా గిరిజనులు సాగులో ఉన్న భూములు జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రైతులతో కలిసి సాంప్రదాయ ఆయుధాలతో తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. గిరిజన ప్రజలకు రక్షణ కవచంగా ఉండవలసిన ఐటీడీఏ పిఒ, రెవిన్యూ అధికారులు జమిందార్ రాజులకు కొమ్ము కాయడం సమంజసం కాదన్నారు.సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, జమీందార్లను భూమిలోకి అడుగు పెట్టనివ్వమని టోకూరు సర్పంచ్ కిలో .మొస్య తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయకుండా ఏ విధంగా సర్వేలు నిర్వహిస్తారని తహäసిల్దార్ రాంబాయిని ప్రశ్నించారు. ఆయా గ్రామాలకు చెందిన 150 మంది పైగా రైతులు సుమారు 300 ఎకరాల భూమి సాగులో ఉన్నారని, వీరందరికీ పట్టాలు మంజూరు చేయాలని ఆయన కోరారుతహాశీల్దార్ రాంబాయి మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల అనుగుణంగా రైతులు సాగులో ఉన్న భూమి, జమీందారులకు చెందవలసిన భూమి ఎంత అనేదానిపై సర్వే జరుగుతుందన్నారు. టోకూరు, అనంతగిరి, ఎగువశోభ పంచాయతీ 8 గ్రాముల పరిధిలో సుమారు 173 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిలో వ్యవసాయ పంటలు, కాఫీ పండ్ల తోటలు ఎంత మేర ఉన్నాయన్న దానేపై సర్వే జరుగుతుందే తప్ప రైతులు ఎవరు అపోహ పడవద్దన్నారు. సర్వే అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎస్.దొన్ను, వార్డు మెంబర్ లక్ష్మణరావు, మురళి, ఆనంద్ రామన్న, చిట్టిబాబు, బీమన్న, ఎం.నాగులు పాల్గొన్నారు.










