జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో ప్రయాణం నరకయాతనగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారులు సైతం గోతులుమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లపై పడిన గోతులు నీటితో నిండి ప్రమాదకరంగా మారాయి. మరమ్మతులకు గురైన రహదారులను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రజాశక్తి - నెల్లిమర్ల : అర్‌అండ్‌బి అధికారుల నిర్లక్ష్యంతో రహదార్లు చెరువుల్లా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నగర పంచాయతీ పరిధి మొయిద జంక్షన్ నుంచి జరజాపు పేట వెళ్లే రహదారిలో కల్వర్టు పూడుకు పోయి మురుగు నీరు రోడ్డు మీదకి వచ్చి వాహన దారులు, ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో మరింత వర్షపు నీరు ఈ ప్రాంతంలో చెరువులా తలపిస్తుందని వాపోతున్నారు. కల్వర్టు వెడల్పు చేయడం ద్వారా పూడిక నివారించి నీరు నిల్వ లేకుండా చేయాలని కోరుతున్నారు. రామ తీర్థం గ్రామంలో నడిబొడ్డున ఇదే పరిస్థితి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ గ్రామంలో మరుగు నీరు రహదారి పై ప్రవహించి గుంతలు పడి వాహన దార్లు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రహదార్లు, భవనాల శాఖ స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
నడక నరకయాతన
వేపాడ: మండలంలోని బొద్దాం జంక్షన్ నుండి ముకుందపురం వెళ్లే రోడ్డు, వేపాడు మీదుగా ఆనందపురం వెళ్లే రోడ్డు, వల్లంపూడి నుండి వేపాడ వరకు వెళ్లి రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యాయి. గత రెండు రోజులుగా పడుతున్న వర్షానికి గుంతలలో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
అధ్వాన్నంగా ప్రధాన రహదారులు
వంగర: మండలంలోని ప్రధాన రహదారులన్నీ పూర్తిగా మరమ్మతులకు గురవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుండి రాజాం పట్టణానికి వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారి అరసాడ వరకు, అరసాడ నుండి నీలయ్య వలస వైపు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి, వంగర నుండి శివ్వాం మీదుగా తలగాం, రుషింగి వైపు వెళ్లే ఆర్ అండ్ బి రహదారి, బంగారు వలస, కొండ చాకరాపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి, మడ్డువలస నుండి జగన్నాథ్ వలస మీదుగా నీలయ్య వలస వెళ్లే ప్రధాన రహదారి గోతులు మయంగా ఉండడంతో ప్రజలు ప్రయాణించేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ కూడా ఈ రహదారుల మీదుగా వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రహదారుల పరిస్థితి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతి నిధులు జోక్యం చేసుకొని రహదారులు బాగు చేయాలని కోరుతున్నారు.
బొబ్బిలి: బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అద్వాన్నంగా మారాయి. పూల్‌బాగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు గోతులుమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూల్‌బాగ్ రహదారిపై నుంచి బలిజిపేట, తెర్లాం, రాజాం, శ్రీకాకుళం ప్రాంతాలకు రాకపోకలు చేస్తుంటారు. ఈ రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందలు పడుతున్నారు. వర్షాకాలంలో వరదనీరు గోతులలో చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డు బాగు చేసేందుకు మున్సిపల్ సాధారణ నిధులు నుంచి రూ.40లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించినా పూర్తి చేయలేదు. రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా రైల్వే వ్యాగన్ లారీలు వెళ్లడంతో రోడ్డు పాడైపోయింది. రోడ్డు పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
అధ్వానంగా పురిటిపెంట రహదారి
గజపతినగరం: నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన పురిటిపెంట నుండి ఆండ్ర వరకు సుమారు 15 కిలోమీటర్లు రహదారిని పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. పెద్ద పెద్ద లారీలు, వాహనాలు తిరగడంతో రోడ్లు చిధ్రమైపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండడంతో కొన్నిచోట్ల రోడ్లు కుంగిపోవడం, మరికొన్నిచోట్ల పెద్దపెద్ద గుంతలుగా ఏర్పడడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.










