Jul 12,2021 16:11

మన ప్రయాణ సమయంలో ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో రోడ్ల మధ్యలో కొన్ని రకాల మొక్కలు అందంగా కొలువుదీరి, ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాంటి మొక్కలనే డివైడర్‌ మొక్కలంటారు. రహదారి మధ్యలో ఉండే డివైడర్లలో అన్ని జాతుల మొక్కలు అంత సులువుగా పెరగవు. విభిన్న ప్రత్యేకతలు ఉన్న కొన్ని జాతుల మొక్కలే పెరుగుతాయి. అలాంటి మొక్కల గురించి తెలుసుకుందాం.
     డివైడర్‌లో పెరిగే మొక్కలు నీటి వనరు ఇబ్బందులను తట్టుకోగలగాలి. ముఖ్యంగా వాటిని పశువులు ముట్టకూడదు, చకచకా పెరగాలి. ప్రయాణీకులకు పర్యాటక శోభ వెదజల్లేటట్టు అందంగా విచ్చుకోవాలి. గాలి, వానలను తట్టుకోవాలి. విపరీతంగా ఆకులు రాల్చకూడదు, కావాల్సిన ఆకారాల్లో మలుచుకోవడానికి అనువుగా ఉండాలి. అటువంటి కొన్ని మొక్కలను ఎంచుకుని, డివైడర్లలో నాటతారు. ఈ డివైడర్‌ మొక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం పదండి..!

                                                                                   థుజా మొక్క

థుజా మొక్క

    ఆకులోని భాగాలు తీగల్లా ఉండి, కాండానికి గుబురుగా విస్తరించిన ఆకుపచ్చని కొమ్మలతో థుజా మొక్క ఉంటుంది. ఇది శంఖాకారంగా పైకి పెరుగుతుంది. ఇది సైప్రస్‌ జాతికి చెందింది. భూమిలోంచి కావాల్సి నంత పోషకాలు అందితే వంద అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వీటిని 'నెమలి పించం' మొక్క అంటారు. గ్రామాల్లో ఇప్పటికీ వీటి ఆకుల్ని నెమలిపించం పేరిట పుస్తకాల పుటల్లో దాచుకుని, పిల్లలు సందడి చేస్తుంటారు. వీటిని డివైడర్లలోనే కాదు, పార్కుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌ ముందర ఆకర్షణగా పెంచుతారు. ఈ మొక్కలను విభిన్న ఆకారాల్లో కత్తిరించుకునే వెసులుబాటు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 'దేవదారు' అని కూడా వీటిని పిలుస్తున్నారు. ఇది మన పురాతన మొక్కే. వీటి ఆకులను గులాబీలతో కలిపి కార్లు, ఇంట్లో గదుల అలంకరణకి వాడతారు.
 

                                                                                థుజా గోల్డ్‌ ట్రీ

 థుజా గోల్డ్‌ ట్రీ

   సైప్రస్‌ జాతికి చెందిన థుజా జాతి మొక్కల్లోనే మరొక రకం థుజా గోల్డ్‌ ట్రీ. వీటి ఆకులు చిలకపచ్చ, మేలిమి రంగుల్లో కళకళలాడుతూ కనిపిస్తాయి. వీటిని డివైడర్లతో పాటు కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
 

                                                                    టర్మినేలియా

  చుట్టూతా అందమైన కొమ్మలతో ఆకర్షణీయంగా విచ్చుకునే మొక్క టర్మినేలియా. వీటిలో వందల రకాలు ఉన్నాయి. చిలకపచ్చ పత్రాలతో మొక్క ఎప్పుడూ కళగా ఉంటుంది. ఇది ఏడాదికి రెండుసార్లు ఆకు రాల్చుతుంది. ఈ మొక్కకు మొదట కేసరాల్లాంటి పువ్వులు వచ్చి, తర్వాత కాయలు కింద తయారవుతాయి. అవే విత్తనాలు. చెట్టు 70 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. క్రమాకారంగా పెరిగే కొమ్మలు చూడటానికి భలే అందంగా ఉంటాయి. శీతల ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది.
 

                                                                              టర్మినేలియా వైట్‌

టర్మినేలియా వైట్‌

    టర్మినేలియాలో అద్భుతమైన మొక్క టర్మినేలియా వైట్‌. వీటి ఆకులు తెలుపు, గోధుమ రంగు ఛాయలో ఉండి అచ్చంగా ప్లాస్టిక్‌లాగ మెరుస్తుంటాయి. కాండం చుట్టూతా కొమ్మలు ఒక క్రమబద్ధమైన పొందికలో పెరుగుతాయి. ఇది తెల్లని తళుకులతో చూడముచ్చటగా ఉంటుంది.
 

                                                                         కోనోకార్పస్‌

   చాలా వేగంగా పెరిగే మొక్క కోనోకార్పస్‌. సన్నగా, పొడవుగా చిన్ని చిన్ని ఆకులు కాండం కనిపించనంత దట్టంగా ఉంటాయి. మొక్క నిండుగా ఆకుల గుబురుతో ఆకుపచ్చని కిషలయ విన్యాసం చేస్తూ ఉంటుంది. బంతి, శంకువు, పళ్లెం, స్థూపంలాంటి విభిన్న ఆకృతుల్లో మొక్కను కత్తిరించుకోవచ్చు. ఇసుక పర్రులు, ఎడారుల్లోనూ ఇవి పెరిగేస్తాయి.
      నీటి వనరులు సక్రమంగా లేకపోయినా ఇవి తట్టుకోగలవు. వీటిని డెజర్ట్‌ కింగ్‌ అంటారు. దుబారులో ఎక్కడ చూసినా ఖర్జూరాలతో బాటు ఈ చెట్లూ కనిపిస్తాయి. ఇటీవల విజయవాడ ప్రధాన రహదారి డివైడర్‌లోనూ ఈ మొక్కలు కనువిందు చేస్తున్నాయి.
 

                                                                  ఫైకాస్‌ మొక్కలు

   డివైడర్లలో పెంచడానికి అందమైన రాటుదేలిన మొక్కలు ఫైకాస్‌. ఈ జాతిలో వందల రకాల మొక్కలు ఉన్నాయి. ఆకులు చాలా మందంగా మెరుస్తూ ఉంటాయి. మొక్క నెమ్మదిగా పెరుగుతుంది కానీ మందంగా ఉంటుంది. వీటినీ కావాల్సిన ఆకారాల్లో మలుచుకోవచ్చు. దశాబ్దాలపాటు పెరిగితే మానులు తిరిగి గోళక్కాయ పరిమాణంలో ఉండే పండ్లను కాస్తుంది. చిన్న చిన్న ఊడలు కూడా వస్తూ ఉంటాయి. వీటి పండ్లంటే పక్షులకు మహా ప్రీతి. పిఫీలికాలు ఈ కాయల కోసం చెట్ల చుట్టూ దండులు కడతాయి. వీటిలో కుండీల్లో పెరిగే మొక్కలూ ఉంటాయి.
 

                                                                               సైకాస్‌ మొక్కలు

సైకాస్‌ మొక్కలు

    డివైడర్లలో పెంచడా నికి అనువైన మరో జాతి సైకాస్‌ మొక్కలు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతా యి. ఆకులు, కాండము అచ్చంగా ఈత చెట్టులానే ఉంటాయి. శీర్షానికి ఇరు వైపులా పుల్లల్లాంటి అమరి కతో ఆకుమట్ట గమ్మత్తుగా ఉంటుంది. డివైడర్‌కు అన్ని వైపులా విచ్చుకుని సైకాస్‌ మొక్క చాలా అందంగా ఉంటుంది. దశాబ్దాల పాటు పెరిగితే మొక్క చిగురు భాగంలోంచి వచ్చే పువ్వు అబ్బురపరుస్తుంది. దీనికి ఆయుర్వేద వైద్యంలో చాలా విశిష్టత ఉంది. ఇది కూడా గట్టి జాతి మొక్క. దీనిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. దీని ధర వేలల్లోనే పలుకుతుంది.
 

                                                                            యూజీనియా మొక్క

యూజీనియా మొక్క

    లేటెస్ట్‌ ట్రెండ్‌తో ఇటీవల బహు ప్రాచుర్యంలోకి వచ్చిన మొక్క ఇది. వీటి ఆకులు ఆకుపచ్చగా, చిగురాకులు చింతపిక్క రంగులో కొలువుదీరి కనుదోస్తాయి. కరేబియన్‌ దీవుల నుంచి చుట్టపు చూపుగా వచ్చి ఇక్కడే నాటుకుపోయి వనప్రియుల మనసుల్లో అల్లుకుపోయిందీ కల్పవల్లి. కుండీల్లోనూ ఈ మొక్కలు ఎంతో సొగసుగా పెరుగుతాయి. ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరిస్తున్న ఇవి చాలా ఏళ్ళు పెరిగిన తర్వాత గోలీకాయ పరిమాణంలో ఉండే పండ్లు కాస్తాయి. వాటిని జెల్లీలు, జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
 

చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506