ప్రజాశక్తి-పాడేరు: పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలం మారుమూల ప్రాంతమైన కొంకితపాడు నుంచి నిమ్మలగొంది వరకు రహదారి నిర్మాణ పనులకు పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 7.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తాను కూడా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. పాడేరు నియోజకవర్గంలో నిమ్మల గొంది వంటి జిఎస్‌పీ రోడ్ల నిర్మాణానికి 5 మండలాలకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఈ రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. మర్రివాడ పంచాయతీ పరిధిలో ఎనిమిది గ్రామాల గడపగడప నిర్వహించినప్పుడే ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. అంతాడ పంచాయతీ ఎద్దుమామిడి, సింగిధార, గంపరాయి, టెంకల పలుకులు గ్రామాలు ఈ రోడ్డుతో అనుసంధానం చేసుకునేలా మరో రహదారి నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇందుకు ఫారెస్ట్ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. మన అవసరాలతో పాటు అడవును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా రహదారి నిర్మాణాలను అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆ శాఖకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సచివాలయాల నిర్మాణం, నాడు - నేడు కింద పాఠశాలలు, హాస్పిటల్స్, రహదారులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమేనని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తాము చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సత్యవతి, ఎంపీటీసీ పిల్లా భవాని, గ్రామ పెద్ద సత్తిబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, బోయిన కుమారి, మండల అధ్యక్షులు జల్లిబాబులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, కుందారి రామకృష్ణ, సర్పంచ్ చందు, పిఎసిఎస్ చైర్మన్ సూరిబాబు, మండల కన్వీనర్ బండి సుధాకర్, సీనియర్ నాయకులు గాడి సత్తిబాబు, శేఖర్, తిరుపతి, లోవరాజు, జీకే వీధి వైస్ ఎంపీపీలు ఆనంద్, దేవుడు, మాజీ జడ్పిటిసి మత్యరాజు, జిల్లా కార్యదర్శి కంకిపాటి గిరిబాబు, సీనియర్ నాయకులు నారాయణ, రామారావు పాల్గొన్నారు.










