
పాలకోడేరు ఎంపిపి చంటిరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
మండలంలోని శివారు ప్రాంతాలు, జగనన్న కాలనీల్లో రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని ఎంపిపి భూపతిరాజు సత్య నారాయణరాజు (చంటిరాజు) అన్నారు. బుధవారం పాలకోడేరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు కాలనీలకు నిధులు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో శృంగవృక్షంలో 20 ఏళ్ల కిందట ఏర్పడిన సిద్ధయ్య కాలనీకి ఇప్పటికే విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో సుమారు 150 కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఎంపిటిసి సభ్యులు సత్యకృష్ణ, బల్లా భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్ధయ్య కాలనీలో పూర్తిస్థాయిలో విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అక్రమ లేఅవుట్లలో సొమ్ములు చెల్లిస్తే ఆఘమేఘాలపై విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నారని, పేదలు నివసించే కాలనీకి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎలక్ట్రికల్ ఎఇని సభ్యులు నిలదీశారు. పంచాయతీ నుంచి స్తంభాల ఏర్పాటుకు సొమ్ము చెల్లిస్తే విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని ఎఇ సమాధానం ఇచ్చారు. జగనన్న కాలనీల్లో రహదారులు ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు అధికారులను కోరారు. ఎంపిడిఒ ఎం.నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకూ మండల వ్యాప్తంగా గ్రామాల వారీగా సంక్షేమ పథకాల బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వేలను సకాలంలో పూర్తిచేయాలని ఆయన కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపి నరేష్, సర్పంచులు బొల్లా శ్రీనివాస్, జంగం సూరిబాబు, కడలి నాగేశ్వరి పాల్గొన్నారు.