Jun 03,2023 23:22

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రహదారులు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లతో పిఒ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా అన్ని మండలాలలో మారుమూల గ్రామాలకు మంజూరైన రోడ్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కొక్క మండలంలో ఎన్ని బీటీ రోడ్లు, ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని మెటల్‌ రోడ్లు మంజూరైనవి, వాటి నిర్మాణం ఏ దశలో ఉన్నది ఆరా తీశారు. పనులు ప్రారంభించి మధ్యలో మానేసిన కాంట్రాక్టర్లను తొలగించాలని సూచించారు. మంజూరైన రోడ్ల మార్గాల్లో ఎన్ని కల్వర్టు, వంతెనలు ఏర్పాటు చేయవలసి ఉన్నదో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోడ్లకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ వచ్చింది, ఇంకా ఎన్ని రోడ్లకు రావాల్సి ఉన్నది మండలాల వారీగా తెలుసుకున్నారు. మంజూరైన రోడ్లను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.డేవిడ్‌ రాజ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు చైతన్య, గౌతమి, దుర్గ ప్రసాద్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు సత్యనారాయణ, భాను, ఉమామహేశ్వరరావు, పి.వెంకటరమణ, నాగరాజు పాల్గొన్నారు.