Dec 28,2022 00:01

కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం

ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రహదారులు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే తెలిపారు. సోమవారం ఆయన వై.రామవరం మండలం మారుమూల గ్రామాలైన చింతలపూడి, వలస గ్రామాలకు సంబంధించిన రహదారులను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి, కోట గ్రామాల మధ్య 3.5 కిలోమీటర్ల రోడ్డు, కన్నేరు వాగుపై వంతెన నిర్మించుటకు చేసిన ప్రతిపాదనలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. వలస జంక్షన్‌ నుండి బంగారు బందలు మధ్యలో కల్వర్టు ఐఎపి నిధులుతో నిర్మిస్తున్న పనులను అయన పరిశీలించారు. చింతకోయ కన్నేరు కాలువపై రూర్బన్‌ నిధులతో వంతెన ఏర్పాటును పర్యవేక్షించారు. రోడ్లు, వంతెనలు, కల్వర్ట్‌లు పూర్తిగా ఏర్పాటు చేస్తే వై.రామవరం మండల కేంద్రానికి రాకపోకలకు చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. అనంతరం చింతలపూడి ఆశ్రమ పాఠశాలను ప్రాజెక్ట్‌ అధికారి పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న మెనూపై ఆరా తీశారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నది, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నది రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అనారోగ్యంగా ఉంటే వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఇఇ జి.డేవిడ్‌ రాజు, డిఇ చైతన్య బాబు, ఎఇ భాను, సర్పంచ్‌ పల్లాల మంగమ్మ, పల్లాల లచ్చిరెడ్డి తదితరులున్నారు.