Jul 28,2023 21:05

మాట్లాడుతున్నకలెక్టర్‌

కడప : ప్రజల ప్రాణ భద్రత.. మనందరి సామాజిక బాధ్యత అని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దష్టి సారించాలని తెలిపారు. ఇటీవల కడప-తిరుపతి ప్రధాన రహదారిలో చోటు చేసుకున్న భారీ రోడ్డు ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. అధికంగా మలుపుల వద్ద బ్యారికెడ్‌, స్టాపర్స్‌, ప్రమాద సంకేత సూచికలను ఏర్పాటు చేయాలని పోలీస్‌, ఇంజినీరింగ్‌ ఆదేశించారు. ముఖ్యంగా స్కూల్స్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పెట్రోల్‌ బంకులు, కమర్షియల్‌ కంప్లెక్స్‌ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అతివేగం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం, బస్సులు, ఇతర వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, కమిటీ మెంబర్‌ కన్వీనర్‌, డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ మీరా ప్రసాద్‌, ఆర్‌డిఒలు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, ఎంవిఐలు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, డిసిహెచ్‌ఎస్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఆర్‌అండ్‌బి, విద్యుత్‌ శాఖల ఎస్‌ఇలు పాల్గొన్నారు.