Aug 04,2023 21:55

రహదారులపై పిఆర్‌ డిఇని ప్రశ్నిస్తున్న జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-మక్కువ : ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా మారుతున్నాయని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి మర్రి పారమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్‌ డిఇ శర్మ మాట్లాడుతుండగా జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుత కాలంలో రహదారులకు గడ్డుకాలం వస్తుందని, రోడ్లపైనే దమ్ము చేసుకునే ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరగడంతో పూర్తిగా అధ్వానంగా తయారవుతున్నాయని చెప్పారు. దీనిపై ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ అధికారులు కనీస పర్యవేక్షణ లేకపోవడం దారుణమని నిలదీశారు. ఇప్పటికైనా పోలీస్‌ శాఖతో సమన్వయంగా ముందుకు వెళ్లి రహదారులు పాడుచేస్తున్న వారిపై చర్యలు చేపట్టకుంటే రానున్న రోజుల్లో రహదారులు రూపాలు లేకుండా పోయే ఆస్కారం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే 'జాగ్రత్తలు పాటించుకుంటే రహదారులకు నష్టమే' అనే శీర్షికతో ప్రజాశక్తిలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభలో అదే అంశం చర్చకు వచ్చింది. రహదారి భద్రతపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
తూముల లీకులు సంగతి మీరు చెప్పండి
వెంగళరాయ సాగర్‌ నుండి ప్రధాన తూముల ద్వారా నీరు లీకేజీ రూపంలో వృథాగా పోతున్నా చర్యలు చేపట్టకుండా సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని చెప్పడంలో అర్థమేముందని తూరుమామిడి సర్పంచ్‌ ఆర్‌.కృష్ణంనాయుడు వెంగళరావు జెఇ జగదీశ్‌ను ప్రశ్నించారు. రెండు పంటలకు నీరు ఇవ్వలేమని చెప్పడం పక్కన పెడితే లీకేజీని ఎలా నివారిస్తారని సభకు తెలపాలని జెఇని జెడ్‌పిటిసి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చేపల చెరువుల యజమానుల కోసం సాగర్‌ నీటిని వృథా చేస్తున్నారని చెముడు ఎంపిటిసి గోపాలకృష్ణ ఆరోపించారు వెంగళరాయసాగర్‌ అధికారులు నీటి పర్యవేక్షణలో విఫలమవుతున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైకా నిధులతోనైనా సాగర్‌ రైతులకు సక్రమంగా నీరందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదేం ఇంటర్నెట్‌. ఎక్కడికక్కడే తీగలు కట్‌..
ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు మంజూరయ్యాయని ఎఇఒ సభకు వివరించారు. ఏకధాటిగా సర్పంచులంతా మాట్లాడుతూ ఇంటర్నెట్‌ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడి భూముల్లో దొర్లుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని, పాఠశాలలకు ఇంకా ఇంటర్నెట్‌ విద్యాబోధన ఎలా ఉంటుందని వారు ప్రశ్నించారు. మండలమంతా ఇదే విధంగా వేసిన వైర్లన్నీ తెగిపడే ఉన్నప్పటికీ పునరుద్ధరణకు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. ఐదు పంచాయతీలకు ఫాగింగ్‌ యంత్రాలు ఎంపిపి మర్రి పారమ్మ, జెడ్‌పిటిసి శ్రీనివాసరావు అందజేశారు.
సమావేశంలో ఎంపిడిఒ సూర్యనారాయణ, ఉపతహశీల్దార్‌ ఇబ్రహీం, వైస్‌ ఎంపిపి నరసయ్య, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.