
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గురటూరులో రహదారులు అధ్వానంగా ఉండటానికి టిడిపి, జనసేన పార్టీలే కారణమని మేయర్‌కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. గుంటూరులోని ఏటి అగ్రహరం విస్తరణ పనులను అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఈ పార్టీలు గుంటూరులో భూగర్భ డ్రెయినేజి పథకం పేరుతో రహదారులన్నీ తవ్వేసి చిన్నాభిన్నం చేశాయని అన్నారు. ఇప్పుడు రహదారులు మెరుగుపరుస్తుంటే ఓర్వలేక నిర్మాణంలో ఉన్న రహదారులపై నిరసన పేరులో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో ఏ.టి అగ్రహారం రోడ్డు ఎంతో ప్రధానమైనదని, పల్నాడు, ఒంగోలు ప్రాంతాల నుండి గుంటూరు నగరంలోకి ప్రవేశించుటకు ఎంతో అనువుగా ఉంటుందని, అందుకే రూ.13 కోట్లతో 80 అడుగుల విస్తరణ చేపట్టి, రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. రోడ్డు విస్తరణలో మొత్తం 182 గృహాలుండగా వాటిలో సుమారు 170 గృహాల వారు స్థలం ఇవ్వటానికి అంగీకరించారని, మిగిలిన గృహాల్లో కొందరు కోర్టుకు వెళ్లటం వల్ల రోడ్డు నిర్మాణ పనులు ఆగాయని చెప్పారు. వారిని కూడా ఒప్పించి, రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డును విస్తరించి, సెంటర్ డివైడర్ ఏర్పాటు చేసి, స్ట్రీట్ లైటింగ్, డ్రెయిన్లను నిర్మించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఎ.సంతోష్, పి.సుబ్బారెడ్డి, ఎ.వెంకట్‌రెడ్డి, ఎ.పద్మావతి, జిఎంసి ఎస్‌ఇ భాస్కర్‌రావు, ఇఇ సుందర రామిరెడ్డి పాల్గొన్నారు.