Sep 17,2023 22:12

పెన్నాడలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎంపిపి చంటి రాజు
ప్రజాశక్తి - పాలకోడేరు

             రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) అన్నారు. మండలంలోని పెన్నాడ గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం, పంచాయతీ, మండల పరిషత్‌ నిధులు రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను సర్పంచి చిల్లా అనూష సత్యనారాయణతో కలిసి ఎంపిపి చంటిరాజు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంటిరాజు మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు. దీనిలో భాగంగా అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం నిధులు, మండల పరిషత్‌ నిధుల ద్వారా అనేక రోడ్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పెన్నాడ గ్రామంలో సకాలంలో రోడ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. సర్పంచి అనూష సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు అవసరానికి తగ్గట్టుగా రహదారులను నిర్మించినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌, ఎంపిపి చంటిరాజు అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేమన్నారు. గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి కోరం వెంకటేశ్వర్లు, పార్టీ గ్రామ అధ్యక్షులు పాండ్రంగి శ్రీను, ఎంపిటిసి సభ్యులు ఆదాడ లక్ష్మీతులసి, ఆరేపల్లి పెదవెంకటస్వామి, నాయకులు గోపాలకృష్ణంరాజు, విశ్వనాథరాజు, కటిక శ్రీదేవి, నరేష్‌, దుండి అశోక్‌, గడ్డం జోషి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.