Oct 08,2023 23:38

రహదారిపై మురుగు నీరు

రహదారిపై మురుగు నీరు
పాదచారులకు
తప్పని కష్టాలు
ప్రజాశక్తి -బంగారుపాళ్యం: బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ అండారెడ్డిపల్లి గ్రామం బెంగళూరు మద్రాస్‌ జాతీయ రహదారి పై మురికి నీరు ప్రవహిస్తోంది. మురుగు నీరు ప్రవహించేందుకు సక్రమమైన కాలువలు లేక ఉన్న కొద్ది కాలువలలో వ్యర్థాలు అధికమై మురికి నీరంతా జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. పాదచారులకు దుర్వాసనతో రహదారి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు పాదచారులు వాపోతున్నారు. నూతన మురికి కాలువ నిర్మించి మురికి నీరు పంపే విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోగా మురికినీరంతా జాతీయ రహదారిపై ప్రవహించడం పట్ల అనారోగ్యాల బారిన పడే పరిస్థితి ఎంతైనా ఉందని ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి మురికి కాలువలను శుభ్రం చేసి మురికి నీరు ప్రవహించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారిపై ఉందని పేర్కొంటున్నారు. గాంధీ జయంతి రోజు స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభించారని, కాని మురికినీరు తొలగించేందుకు కాలువలను శుభ్రం చేయకపోగా కాలువలో వ్యర్థాలు అధికమై దోమల బెడద ఎక్కువగా ఉందని పరిసర కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మురికి నీరు కాలువలలో ప్రవహిం చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.