Nov 02,2023 23:58

ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి - భట్టిప్రోలు
జాతీయ రహదారి 216పై అడ్డుగా పోసిన మట్టిని అధికారులు గురువారం తొలగించారు. 'జాతీయ రహదారిపై ప్రమాదాలు' అనే శీర్షిక గురువారం ప్రజాశక్తి దినపత్రికలో కదనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన మట్టిని లారీలకు ఎత్తి బయటకు తరలించి రహదారిని శుభ్రపరిచారు. మండలంలోని కన్నెగంటివారిపాలెం, వరికుటివారిపాలెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రహదారి పనులు పూర్తికానందున వాహనాలు రాకపోకలు నియంత్రించేందుకు మట్టిని అడ్డుగా ఏర్పాటు చేశారు. భట్టిప్రోలు సమీపంలో సురేపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై ఏర్పాటు చేస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ వాహనాలు తిరుగుతుండటంతో పనులకు ఆటంకం కలుగుతుందని మట్టిని అడ్డుగా వేసామని, అయినప్పటికీ వాహనాల రాకపోకలు ఆగకపోగా ప్రమాదాల జరుగుతున్న దృష్ట్యా మట్టిని తొలగించినట్లు ఎన్‌హెచ్ ఏఈ పురుషోత్తమరాజు తెలిపారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తికానప్పటికీ దాని కింద అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని అన్నారు.