జిల్లా పరిషత్తు సమావేశంలో జెడ్‌పిటిసి ఒడుగుల జ్యోతి విజ్ఞప్తి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏలేశ్వరం, గొంతువానిపాలెం, జె.అన్నవరం రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని రాజబొమ్మంగి జెడ్పిటిసి ఒడిగుల జ్యోతి విజ్ఞప్తి చేశారు. బుధవారం కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో జ్యోతి మండలంలో నెలకొన్న పలు సమస్యలను వినిపించారు. ఏలేశ్వరం, జె.అన్నవరం ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ రహదారిలో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారని, అవి నేటికీ పూర్తి కాలేదని చెప్పారు. ఈ పాఠశాలలో సుమారు 600 పైబడి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఇటీవల ఇదే పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేశారని తెలిపారు. ఇక్కడే నూతనంగా జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దష్ట్యా భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రాజవొమ్మంగి, జడ్డంగి, లాగరాయి పిహెచ్‌సిల్లో మందుల కొరత లేకుండా చూడాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.










