ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మారు మూల బూర్జ పంచాయతీ పాట్కదౌడ సరిహద్దు గ్రామాలకు రహదారి నిర్మాణానికి జడ్పీటీసీలు రేగం మత్య్సలిగం, దీసరి గంగరాజు, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిలు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీటీసీలు రేగం మత్య్సలింగం, దీసరి గంగరాజులు మాట్లాడుతూ, రెండు మండలాల సరిహద్దు గ్రామాలు ఏర్పడి సూమరు 80 ఏళ్ళ పై బడినా అభివృద్ధికి నోచుకో లేదన్నారు. అంతగిరి మండలం రాజపాక, దెక్కపూరం, హుకుంపేట మండలం పాట్కదౌడ గ్రామానికి మిషన్ కనెక్టివిటీ ఐటీడీఏ, పాడేరు ప్రోగ్రామ్ కింద రూ.2.40 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని వారు తెలిపారు.గత కొద్ది ఏళ్ళుగా రహదారి సౌకర్యాలు లేక రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే కనీసం అంబులెన్స్ కూడా రాని పరిస్థితిలో గిరిజనులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు..గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు కేటాయించిన ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకష్ణ, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోమెలి రూతు, ఎగుసోభ సర్పంచ్ సింహాద్రి, గెమ్మెలి అప్పారావు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










