Oct 25,2022 23:34

రహదారి నిర్మాణ స్థలం వద్ద గిరిజనులతో ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిశోర్‌

ప్రజాశక్తి -సీలేరు
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న గాలికొండ పంచాయతీలో చింతపల్లి ఎఎస్‌పి కొమ్ము ప్రతాప్‌ శివ కిశోర్‌ సోమవారం పర్యటించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్య పరిష్కరించి వారితో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ మావోయిస్టులకు అడ్డాగా ఉంది. గతంలో ఎఎస్‌పీ ఈ గ్రామ సందర్శనకు వెళ్లినప్పుడు తమకు రహదారి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా అనారోగ్యసమస్యలు ఎదురైనప్పుడు అనేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు చెప్పారు. శ్రమదానంతో రహదారి నిర్మాణం చేద్దామనుకుంటే పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుంగా ఉన్నాయని, దీనికి పరిష్కారం చూపాలని కోరారు. గాలికొండ పంచాయతీలో చిలకగొంది నుంచి పాత్రునిగుంట వరకూ రహదారి లేదు. గతంలో ఈ రహదారి నిర్మాణం కోసం పలు మార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో వారికి రహదారికి కలగా ఉండిపోయింది. దీనిపై స్సందించిన చింతపల్లి ఎఎస్‌పీ కేపీఎస్‌ కిశోర్‌ ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నడుంబిగించారు. పెద్ద బూసికొండ గ్రామాన్ని సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. మీరు చేయి చేయి కలిపితే మేము సహకరిస్తామన్నారు. దీనికి గ్రామస్థులంతా సై అన్నారు. చింతపల్లి నుంచి తీసుకొచ్చిన ప్రొక్లెయిన్‌ సహాయంతో రహదారి ప్రాంతంలో ఉన్న బండరాళ్లును తొలగించి రహదారి నిర్మాణం చేపట్టడారు. ఈ సందర్బంగా పెద్దబూసికొండ, గడ్డిబంద, చిలకలగొంది, పాత్రునిగుంట గ్రామస్తులతో ఎఎస్‌పి దీపావళి నిర్వహించారు. ఈ దీపావళితో మీ గ్రామానికి ఉన్న రహదారి కష్టాలు తొలిగిపోవాలని, ఇందుకు అవసరమయ్యే సహాయ సహకారాలు పోలీసు శాఖ నుంచి అందిస్తామని ఎఎస్‌పీ కేపీఎస్‌ కిశోర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జీకేవీధి సీఐ జి.అశోక్‌కుమార్‌, సర్పంచి బుజ్జిబాబు, ఎంపీటీసీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.