Apr 15,2021 06:52

ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఆ దేశం మంటల్లో రగులుతోంది. మిలిటరీ తిరుగుబాటు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రద్దు, ఆంగ్‌ సాన్‌ సూకీ, ఆమె పార్టీ సహచరుల అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నిరసనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 700 మంది దాకా మరణించారు. మూడు వేల మందికి పైగా అరెస్టయ్యారు. ఇంకా అనేక మంది జాడ తెలియరాలేదు. మయన్మార్‌లో సైనిక తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. సైనిక తిరుగుబాట్లు నిత్యకృత్యంగా మారిన మన పొరుగు దేశమైన మయన్మార్‌ చాలా కాలం పాటు (1988-2011) సైనిక పాలన కింద మగ్గింది. ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వ సాధనకై ఎంతో కాలంగా సాగించిన పోరాట ఫలితంగా మిలిటరీ ప్రభుత్వం దిగొచ్చి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేందుకు, ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి తన అధికారాల్లో కొన్నిటిని అప్పగించేందుకు ఒప్పుకుంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలు, అంతర్జాతీయ సమాజం నుంచి మిలిటరీ పాలకులపై పెరిగిన ఒత్తిడి ఫలితంగా 15 ఏళ్లుగా జైలులో ఉన్న ఆంగ్‌ సాన్‌ సూకీని మిలిటరీ ప్రభుత్వం విడుదలజేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. అయినా సూకీ ప్రభుత్వాధినేత కావడానికి సైన్యం అనుమతించలేదు. మిలిటరీ ఆమోదించిన రాజ్యాంగం విదేశీయుణ్ణి వివాహమాడినవారు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నత పదవులను అధిష్టించడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. దీంతో ఆమె ప్రభుత్వ కౌన్సిలర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వంపైన, ప్రభుత్వ విధానాలపైన అపరిమితమైన ప్రభావం చూపగలిగే స్థితి ఆమెకు ఉన్నదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఆమె (నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత) కనుసన్నల్లో రోహింగ్యాలపై సాగిన ఊచకోతను యావత్‌ ప్రపంచం ఖండించింది.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పవని చాలా మంది భావించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌ఎల్‌డి పార్లమెంటులో తన బలాన్ని పెంచుకోగలిగింది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన సైన్యానికి సైతం ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలొచ్చాయి. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఎన్నికల కమిషన్‌ వీటిని తోసిపుచ్చింది. అప్పటి నుంచి సైన్యానికి, ఎన్నికైన ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండోసారి ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు సైన్యం అనుమతించదన్న పుకార్లు వ్యాపించాయి. చివరికి ఆ పుకార్లే నిజమని సైన్యం నిరూపించింది.

మిలిటరీ తిరుగుబాటు తరువాత అధికార పగ్గాలు ఒక ఏడాది పాటు తాను చేపట్టనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఆ వెంటనే మిలిటరీ కమాండర్‌ చీఫ్‌ జనరల్‌ మిన్‌ హిలియాంగ్‌ అధికారం చేపట్టారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు సీనియర్‌ నేతలను సైన్యం నిర్బంధించింది. అవినీతికి పాల్పడ్డారంటూ సూకీ పైనా పలు కేసులు పెట్టింది. సూకీకి తన రాజకీయ మిత్రపక్షం నుంచి 6 లక్షల నగదు, బంగారు కడ్డీలు ముట్టాయన్న అభియోగాలను మోపింది. ఇటీవల ఓ చీకటి వ్యాపారి ప్రభుత్వ టి.వి లో మాట్లాడుతూ తన వ్యాపారంలో సహకరించేందుకు ప్రభుత్వం లోని మంత్రులకు 2018-2020 మధ్య ఎంతెంత మొత్తం ఇచ్చినదీ వెల్లడించారు. ఇందులో సూకీ పేరును కూడా ప్రస్తావించారు. 2018లో సూకీ తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్‌ ఫౌండేషన్‌కు లక్ష డాలర్లు ఇచ్చానన్నారు. 2019లో లక్షా యాభై వేల డాలర్లు, 2020 ఫిబ్రవరిలో 50 వేల డాలర్లు, 2020 ఏప్రిల్‌లో రెండు లక్షల యాభై వేల డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఎందుకిచ్చినదీ నిర్దిష్టంగా తెలపలేదు. ఈ ఆరోపణలపై దేశంలోని అవినీతి నిరోధక కమిషన్‌ దర్యాప్తు చేపట్టింది. అవినీతి నిరోధక చట్టం కింద సూకీపై చర్య తీసుకుంటామని చెప్పింది. ఆమె పైన, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విన్‌ మియంట్‌ పైన అశాంతిని రెచ్చగొట్టారని, వాకీటాకీలను అక్రమంగా కొనుగోలు చేశారని, కరోనా నిబంధనలను అతిక్రమించి సభలకు జనాన్ని సమీకరించారన్న అభియోగాలను ఆర్మీ మోపింది.

సూకీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమంత సంతోషంగా లేరన్న మాట నిజం. ఉద్యోగాల కల్పన హామీలు నెరవేర్చడంలో ఆమె విఫలమయ్యారు. ప్రభుత్వంలో కింది నుంచి పై దాకా అవినీతి పెరిగిపోయింది. దేశ స్థూల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనాను ఎదుర్కోవడంలో విఫలమైంది. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిలుస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అసమర్థులు, వివాదాస్పదులైన వ్యక్తులు ఆమె చుట్టూ చేరడం, వారిపైనే ఆమె ఎక్కువగా ఆధారపడడం, ప్రజాస్వామ్యం గురించి మాటలే తప్ప చేతలు లేకపోవడం, ఆమె ప్రభుత్వం (డిఫ్యాక్టో ఎన్‌ఎల్‌డి ప్రభుత్వం) అనేక క్రూరమైన చట్టాలు తీసుకొచ్చి, చాలా మందిని జైలులో పెట్టడం, విమర్శలను సహించలేకపోవడం ఇవన్నీ చూశాక సూకీ అంటే నియంత అన్న భావన ఏర్పడింది. ఆమెలో ఉన్న ఈ లోపాలను సొమ్ము చేసుకోవచ్చని భావించిన సైన్యం ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసింది. సూకీని, ఆమె సహచరులను అరెస్టు చేసింది. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు ఈ విషయంలో ఆర్మీ అంచనా తప్పు అని రుజువు చేశాయి. తిరుగుబాటు తరువాత నిరసనలు తలెత్తుతాయని సైన్యం కరెక్టుగానే అంచనా వేసింది. అయితే ఆ నిరసనలు ఈ మోతాదులో ఉంటాయని ఊహించలేకపోయింది. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అలా అని మిలిటరీ పాలనను సమర్థించేందుకు, ఎంతో కష్టపడి సాధించిన హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా లేరు.

మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యువత పెద్దయెత్తున వీధుల్లోకి వస్తోంది. వారికి దన్నుగా కార్మిక సంఘాలు నిలిచాయి. ఈ ప్రతిఘటన అంతకంతకూ ఊపందుకుంటోంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మధ్యతరగతి ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు (ఆరోగ్య కార్యకర్తలు-మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్లో 10శాతం దాకా వీరే ఉన్నారు), బ్యాంకర్లు, కిరాణా వ్యాపారులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో నిపుణులు ఈ ఆందోళకారులకు అవసరమైన నగదు, రేషన్‌, షెల్టర్‌ సమకూర్చుతున్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నారు.

ఈ నిరసనల ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలపై తీవ్రంగా పడుతోంది. నిరసనల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ మిలిటరీ, వారి కుటుంబాలు ప్రజల్లో చులకన అవుతున్నాయి. ఈ కుటుంబాలకు పచారీ సరుకులు సరఫరా చేయొద్దన్న డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. దేశాన్ని స్తంభింపజేయడం ద్వారా మిలిటరీ పాలనను దించేయాలన్న తమ లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో నిరసనకారులు ఉన్నారు.

నిరసనలపై మిలిటరీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. 'అవాంఛనీయ వ్యక్తుల జాబితా పేరుతో సైన్యం వేటాడదలచుకున్న కొంతమంది పేర్లను, వారి ఫొటోలను విడుదలజేసింది. ఆ జాబితాను సోషల్‌ మీడియా అకౌంట్లకు, వారి నివాస ప్రాంత చిరునామాకు పంపింది. ఈ జాబితాలో ప్రముఖ కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఉన్నారు. తన ఆదేశాలను ధిక్కరించి, శాసనోల్లంఘనకు పాల్పడేవారు ఎంతటివారైనా అరెస్టు చేస్తామని ఆర్మీ బెదిరించింది. అరెస్టులు, వేధింపులు వంటివి రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.

సాయుధ ఉగ్రవాద గ్రూపులు తమ విచ్ఛిన్నకర ఎజెండాతో ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నాయంటూ సైన్యం కొన్ని ఉగ్రవాద గ్రూపుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై ముఖ్యంగా థాయిలాండ్‌తో గల సరిహద్దు ప్రాంత గ్రామాలపై ఇప్పటికే బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో గ్రామాలకు గ్రామాలే నాశనమవుతున్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని సరిహద్దుల గుండా ఇతర దేశాలకు శరణార్థులుగా పారిపోతున్నారు.

మయన్మార్‌లో జాతుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ దేశంలో దాదాపు 135 దేశీయ జాతులు, తెగలు వున్నాయి. బామర్‌ జాతి వీటన్నిటిలోకి పెద్దది. మొత్తం దేశ జనాభాలో 50 శాతం దాకా వీరే ఉన్నారు. ఇతర జాతులు మిగతా సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బామర్‌ జాతి దేశ మధ్య భాగంలో వుండగా, ఇతర జాతులు సరిహద్దులను ఆనుకుని వున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మయన్మార్‌ భారత్‌తో 1600 కి.మీ పొడవునా సరిహద్దు కలిగివుంది. అలాగే చైనా, థాయిలాండ్‌, బంగ్లాదేశ్‌లతో కూడా అది విశాలమైన సరిహద్దు కలిగివుంది. మెజార్టీ జాతికి, ఇతర మైనార్టీ జాతులకు మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా జాతులకు చెందిన గ్రూపులు తమ సొంత సైన్యాన్ని నడుపుతున్నాయి. ఆ ప్రాంతాలపై అవి ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా మయన్మార్‌ ప్రభుత్వ దళాలతో అవి పోరాడుతున్నాయి. ప్రస్తుత నిరసనల్లో చాలా వరకు మధ్య మయన్మార్‌ లోని పట్టణాలు, నగరాల్లోనే జరుగుతున్నాయి. కరెన్‌ (థాయిలాండ్‌తో గల సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతంలో నివసించే జాతి), కచిన్‌ (చైనాతో గల సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతం) ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించి, అందులో పాల్గొంటున్నాయి. సైనిక తిరుగుబాటు ద్వారా కూలదోయబడి, ప్రస్తుతం ప్రవాసం నుంచి నడుస్తున్న ఎన్‌ఎల్‌డి ప్రభుత్వం మార్చి14న పయదువాంగ్షు హలుత్తావ్‌ రిప్రజెంటింగ్‌ కమిటీ (సిఆర్‌పిహెచ్‌) ఏర్పాటుకు పిలుపునిచ్చింది. ఈ కమిటీ ప్రజలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెబుతోంది. ఈ జాతులకు చెందిన సాయుధ దళాలు ఉగ్రవాద గ్రూపులు, అవాంఛనీయ శక్తులు ఎంతమాత్రం కావని తెలిపింది. అవాంఛనీయ సంస్థలుగా ముద్ర పడిన ఈ గ్రూపులతో కలసి పని చేసేందుకు సిఆర్‌పిహెచ్‌ మరీ ముఖ్యంగా కాచిన్‌ రాజకీయపరంగా తాత్కాలిక కో-ఆర్డినేషన్‌ టీమ్‌ని ఒకదానిని ఏర్పాటు చేసింది. ఫెడరల్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ ఏర్పాటుతో సహా ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఈ కమిటీ కృషి చేస్తుంది. అయితే సూకీ, ఆమె బృందం ఈ ఫెడరల్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ విషయంలో ఇప్పటికీ మౌనం వహిస్తున్నారు. రోహింగ్యాలపై దాడులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు పెట్టిన వారు చాలా మంది బాహాటంగా ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నారు. వారితో కలసి నిరసనల్లో పాల్గొంటున్నారు. మిలిటరీపై పోరాడేందుకు ఫెడరల్‌ ఆర్మీ ఏర్పాటు కోసం వారు డిమాండ్‌ చేస్తున్నారు.

దీంతో సైన్యం కూడా ఈ జాతుల సాయుధ గ్రూపులను మచ్చిక చేసుకునే యత్నాలు మొదలు పెట్టింది. దేశంలోనే అత్యంత కరడుగట్టిన సాయుధ గ్రూపుల్లో ఒకటైన రఖీన్‌ కు చెందిన అరకాన్‌ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా తాము పరిగణించడం లేదని మిలిటరీ ప్రకటించింది. యావత్‌ ప్రపంచాన్ని కలచివేసిన రోహింగ్యాలపై దాడులు రఖీన్‌లో అరకాన్‌ ఆర్మీ పేరుతో సాగినవేనన్న విషయం మనం మరువరాదు. ఈ జాతుల సాయుధ గ్రూపులను బుజ్జగించేందుకు ఎన్‌ఎల్‌డి చేస్తున్న యత్నాలు ఫలించే సూచనలు కనబడడం లేదని కొందరు వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. ఎన్‌ఎల్‌డి, సూకీ మెజార్టీ జాతికి చెందిన బార్మర్‌ గ్రూపు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవారని ఈ సాయుధ గ్రూపులు భావిస్తుండడమే దీనికి కారణంగా వారు చూపుతున్నారు. ఎన్‌ఎల్‌డి ఒక జాతీయ పార్టీగా ఉండి కూడా ఈ గ్రూపు ప్రయోజనాలను కాపాడడం కోసమే పనిచేస్తోంది. ఎన్‌ఎల్‌డి ప్రజాతంత్ర పాలన ప్రయోజనాలు మెజార్టీ జాతికి చెందాయి తప్ప తమ ప్రాంతాలకు ఒనగూడిందేమీ లేదని వారు భావిస్తున్నారు. గత పదేళ్ల ఎన్‌ఎల్‌డి పాలనలో మైనార్టీ జాతులపై దాడులు పెరగడం, రోహింగ్యాలపై దాడులు జరిగినప్పుడు సూకీ మౌనం వహించడమే దీనికి నిదర్శనం అని వారు చెబుతున్నారు.
ఏదేమైనా ఈ ఎత్తులు, పై ఎత్తులు దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేవిగాను, జాతి పరమైన విద్వేషాలు, దాడులకు మరింత ఆజ్యం పోసేవిగాను ఉన్నాయి. ఈ ఘర్షణలు గనుక విస్తరిస్తే భారత్‌తో సహా మయన్మార్‌తో సరిహద్దు కలిగిన అన్ని దేశాలపైన దీని ప్రభావం పడుతుంది.
కరెన్‌ లిబరేషన్‌ ఆర్మీ (కెఎల్‌ఎ) అనేది బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటు చేసింది. మిలిటరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత దూకుడుగా సాగేలా చూసేందుకు, యువ ఆందోళనకారులతో సన్నిహిత సమన్వయం నెరపేందుకు బిబిసి, రేడియో ఫ్రీ ఆసియా (అమెరికా నిధులతో నడిచేది), వాయిస్‌ ఆఫ్‌ అమెరికా వంటి ప్రచార సాధనాలు పనిచేస్తున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. ఇక్కడ 'వారి ప్రయోజనమేమిటి' అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

మయన్మార్‌ భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉండడం వల్ల దానిలో వారి ప్రయోజనం ఇమిడి ఉంది. భారత్‌, చైనాలతో అది విశాలమైన సరిహద్దును కలిగి ఉండడమే కాదు, బంగాళాఖాతంతో కూడా అది అనుసంధానమై ఉంది. బంగాళాఖాతం, మలక్కా జలసంధిపై కంట్రోల్‌ సాధించగలిగితే, హిందూ మహాసముద్రం లోని జల మార్గాలపై కూడా కంట్రోల్‌ సాధించినట్టే. దీనిని సాధించడం కోసమే అమెరికా తహతహలాడుతోంది. 'ఆసియా పైవోట్‌' అన్నా, 'ఇండో-పసిఫిక్‌ వ్యూహం' అన్నా, 'ఆసియన్‌ సెంచరీ' అన్నా ఇలా ఏ పేరుతో పిలిచినా దాని అసలు లక్ష్యం ఇదే.
మయన్మార్‌లో అశాంతి ఆ దేశాన్ని అరాచకమనే అగాథం లోకి మరింతగా నెడుతున్నది. అమెరికా కోరుకుంటున్నది కూడా ఇదే. అక్కడ పరిస్థితి ఎంతగా దిగజారితే, దానిని ఆసరా చేసుకుని మయన్మార్‌లో చొరబడి, అక్కడ తిష్టవేసేందుకు తనకు అంతగా వీలవుతుందన్నది అమెరికా పన్నాగం. పశ్చిమాసియాను ఇలాగే కల్లోలంలోకి నెట్టింది. ఇప్పుడు తూర్పు ఆసియాను అది లక్ష్యంగా చేసుకుని తనకు బాగా అలవాటైన టక్కుటమార విద్యలను ఇక్కడ ప్రయోగిస్తోంది. ప్రజల్లో వున్న అసంతృప్తిని ఉపయోగించుకుని సాయుధ ఘర్షణలను ప్రేరేపిస్తూ దేశాన్ని అరాచకంలోకి నెట్టడం, తద్వారా ప్రభుత్వాన్ని మార్చివేసి, పట్టు సాధించాలన్నది సామ్రాజ్యవాద వ్యూహం. ఆప్ఘనిస్తాన్‌ లోను, ఇరాక్‌ లోను, అటుపిమ్మట పశ్చిమాసియా/ఉత్తర ఆఫ్రికాలో తలెత్తిన 'అరబ్‌ రివల్యూషన్‌' సమయం లోను అనుసరించిన జిత్తులమారి ఎత్తుగడలనే ఇప్పుడు మయన్మార్‌ లోను అది ప్రయోగిస్తున్నది. ఇందుకోసం తన స్లీపింగ్‌ సెల్స్‌ను అది యాక్టివేట్‌ చేస్తోంది.

మయన్మార్‌లో సామ్రాజ్యవాద పన్నాగాలు ఫలించేందుకు అనుమతించడం చాలా ప్రమాదకరం. చైనాను లక్ష్యంగా చేసుకుని, దాని అభివృద్ధికి చెక్‌ పెట్టేందుకే అది ఈ ఎత్తుగడలు వేస్తుందనకుంటే పొరపాటు. ఈ కుట్రల వల్ల భారత్‌ కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది. 1991లో (సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత) అమెరికా ఒక ప్రకటన చేస్తూ, 'సూపర్‌ పవర్‌'గా ఎదిగేందుకు ఎవరు యత్నించినా, సహించేది లేదని హూంకరించింది. ఆ పరిస్థితి గనక వస్తే ప్రపంచంపై తన పెత్తనానికి నూకలు చెల్లుతాయన్న భయం అమెరికాను వెంటాడుతోంది. చివరికి భారత్‌ను కూడా అది సహించదనే విషయం మరువరాదు.

మన పొరుగు దేశంలో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న పన్నాగాలు, మితిమీరిన జోక్యాలు ఆందోళనకు గురిచేసేవన్న భావన మనకు ఉండాలి. మయన్మార్‌ ప్రజల ప్రజాతంత్ర ఆర్తిని బలపర్చడంలోను, అక్కడ ఉవ్వెత్తున సాగుతున్న నిరసనలను అణచివేసేందుకు సాగుతున్న అన్ని రకాల నిర్బంధాలను ఖండించడంలోను మనం ఎప్పుడూ ముందుండాల్సిందే.
                              * ఆర్‌. అరుణ్‌ కుమార్‌ /వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు/