రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమంలో
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
జెఎసి నాయకులు సత్యదీప్
ప్రజాశక్తి - బేతంచర్ల
రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఏపీ జేఏసీ చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని జెఎసి నాయకులు సత్యదీప్ పేర్కొన్నారు. సోమవారం బేతంచెర్ల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యదీప్, ఆర్‌ఐ శ్రీదేవి మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంకై ఎపి జెఎసి చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీ నుండి చేపట్టడం జరిగిందని అన్నారు. కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల స్థానంలో కారుణ్య నియామకాలు జరపాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించిన స్పందించకపోవడం విచారకరమని వారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు అందరు కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీదేవి, జూనియర్ అసిస్టెంట్ అశోక్, వీఆర్‌ఏ నాగేష్, సురేష్, విఆర్‌ఓ శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










