
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలను గడువులోగా పూర్తి చేయాలని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సూచించారు. డిఆర్వో పి వెంకటరమణ తో మంగళవారం కలెక్టరేట్ నుండి మండలాధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆలస్యంగా నమోదైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పెండింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, సత్వరమే క్లియర్ చేయాలి అన్నారు. రి సర్వేకు సంబంధించి పెండింగ్ స్టోన్ ప్లాంటేషన్ నూరు శాతం పూర్తి చేయుటకు బుధవారం మెగా డ్రైవ్ నిర్వహించుటకు తాసిల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం జగనన్నకు చెబుదాం పిటిషన్ గడువులోగా పరిష్కరించాలన్నారు. పిటిషన్ దారునితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి, సమస్య పరిశీలించి, తగిన విచారణ నిర్వహించి, అర్జీ దారునికి సంతప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. సింగిల్ లైన్ ఎండార్స్మెంట్ వల్ల రీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందని, వివరణాత్మకంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఈనెల 30వ తేదీ నుంచి జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహణకు సంసిద్ధం కావాలన్నారు. ఆయా పీహెచ్సీలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ల పరిధిలో వైద్యులతో పాటు స్పెషలిస్ట్ వైద్యులు కూడా మెడికల్ క్యాంపుల్లో పాల్గొని వైద్య సేవలు అందిస్తారని మెడికల్ క్యాంపులు విజయవంతం గావించాలని తెలిపారు.ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణానికి సంబంధించి గ్రామ సచివాలయ, ఆర్ బి కే, హెల్త్ క్లినిక్ భవనాలు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ జి గీతాబాయి, కలెక్టరేట్ ఏవో రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.