- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మండలంలోని రేగులపాడు పంచాయతీ పరిధిలో సుమారు రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయ సముదాయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల కిందట బ్రిటిష్ వారు చేసిన సర్వే నేటికీ అమల్లో ఉందన్నారు. భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉండడంతో గ్రామాల్లో భూ తగాదాలకు కారణమన్నారు. వాటిని దూరం చేసేందుకు సమగ్ర భూ సర్వే ఎంతగానో దోహదం కానుందన్నారు. ఇప్పటివరకు రెండు వేల సచివాలయాల్లో పూర్తయ్యాయని, రెండో దశలో మిగిలినవి పూర్తి చేయనున్నామని చెప్పారు. రైతుల సాగులో 20 ఏళ్లు ఉన్న అసైన్డ్ ల్యాండ్‌కు హక్కులు కల్పించామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన వచ్చిందన్నారు. ప్రతిపక్షాలకు పని లేక జగనన్న కాలనీలో నీరు చేరింది, వాగులు పొంగుతున్నాయని విమర్శిస్తున్నాయన్నారు. వర్షాలు పడితే నీరు చేరదా? వాగులు పొంగవా? రహదారులు బురద కావా? అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగిందని నమ్మితే వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేయాలన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీలే కావాలంటే మీ ఇష్టమన్నారు. కరోనా సమయంలో పక్క ఇంటికి వెళ్లాలంటే భయపడే రోజుల్లో వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి రేషన్ అందించారని, అలాంటి వారిపై అవగాహన లేని నాయకుడు మాట్లాడే మాటలకు బాధపడాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో వైసిపి టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పిటిసి దుబ్బ వెంకటరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బాడాన మురళి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజారామకృష్ణ, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్‌రంజాన్ రాజు, అన్నెపు రామారావు తదితరులు పాల్గొన్నారు.










