ప్రజాశక్తి-ఆలూరు
'పైసలిస్తే ఏమైనా చేస్తాం' అంటూ కొందరు రెవెన్యూ అధికారులు లేని భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో ఎక్కించేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కులాలను మారుస్తూ తప్పుడు సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆలూరు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి అడ్డు, అదుపు లేకుండా పోతోంది.
తప్పుడు కుల సర్టిఫికెట్ మంజూరు
మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఆలూరులో కాపురం ఉంటున్నారు. భర్తతో గొడవ పడిన సమయంలో పోలీసు స్టేషన్‌కు తిరిగే క్రమంలో కుల సంఘానికి చెందిన నాయకునితో బంధం ఏర్పడింది. కులసంఘం నాయకుని పలుకుబడితో ఏకంగా బీసీ సామాజిక మహిళకు ఎస్సీ సర్టిఫికెట్‌ను మంజూరు చేయించారు. గ్రామ సచివాలయంలో పని చేసే విఆర్‌ఒ సహకారంతో రెవెన్యూ అధికారులు మామూళ్లకు తలొగ్గడంతో సర్టిఫికెట్ మంజూరయినట్లు తెలిసింది. ఓ వైపు ఎస్సీ సర్టిఫికెట్ పొందిన మహిళ గతేడాది వైఎస్‌ఆర్ చేయూత పథకం, ఒంటరి మహిళ పింఛను పథకంలో ఎస్సీ సామాజిక కులం పేరుతో, ఇల్లు మంజూరులో మాత్రం బీసీ సామాజిక పేరుతో ఇలా వివిధ పథకాల్లో వేర్వేరుగా ఉండడం చూస్తే అధికారుల పని ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
అక్రమాలకు కేరాఫ్ రెవెన్యూ కార్యాలయం...
మండలంలోని మొలగవల్లి గ్రామంలో గతేడాది లేని భూములను ఇతరులకు ఆన్‌లైన్‌లో ఎక్కించిన సంఘటనలో తహశీల్దార్, సచివాలయ విఆర్‌ఒ, కంప్యూటర్ ఆపరేటర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో జరిగే ప్రతి పనికీ ఓ రేటు ప్రకారం వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి కేరాఫ్ అయిన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆలూరు తహశీల్దార్ కార్యాలయం










