పశ్చిమ గూటికి గణపవరం మండలం
ఏలూరు మండలం అర్బన్, రూరల్‌గా విభజన
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
తాడేపల్లిగూడెం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం అమోదం తెలిపింది. దీంతోపాటు ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం రెవెన్యూ డివిజన్‌లో కలుపుతూ మంత్రిమండలి నిర్ణయించింది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించే క్రమంలో ఏలూరును అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏలూరు రూరల్‌లో ఉన్న దాదాపు 16 గ్రామాలు రూరల్ మండలంగా, ఏలూరు పట్టణం అర్బన్ మండలంగా ఏర్పడనుంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతోపాటు పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. గతంలోనే ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలపనున్నట్లు సిఎం జగన్ ప్రకటించగా నోటిఫికేషన్ సైతం విడుదల చేసి అభ్యంతరాలను ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటి వరకూ గెజిట్ విడుదల కాకపోవడంతో అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం రెవెన్యూ డివిజన్‌లో కలిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాడేపల్లిగూడెం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జిల్లాల విభజన ప్రక్రియ నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ముందుకు సాగలేదు. తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉండటంతో రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం వేయడంతో డివిజన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడనున్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు.










