
ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా వెంకటరామా ఆస్పత్రి వైష్ణవ్ ఐ కేర్ సెంటర్‌లో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యాన మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 50 మంది పైగా షుగర్, కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఐ కేర్ వైద్యులు డాక్టర్ బాలి తనూజ శిబిరానికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ షుగర్ నియంత్రణలో లేకపోవడం వలన కంటిలో నరం దెబ్బతింటుందని అన్నారు. దానినే డయాబెటిక్ రెటినోపతి అంటారన్నారు. మొదటి దశలో గుర్తిస్తే కొన్ని రకాల మందుల ద్వారా నియత్రంచవచ్చు అన్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా సుగర్ మందులు వాడాలన్నారు. రెటినోపతి నిర్ధారణ అయినవారు ప్రతి రెండు నుంచి ఆరు నెలలకు ఒక్కసారి వైద్యులను కలసి కంటి చెకప్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వెంకట రామా హాస్పిటల్ అధినేత డాక్టర్ చిట్టి వెంకటరమణ, ఎఒ సన్యాసిరావు, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.