రెస్టారెంట్ పునరుద్ధరణకు చర్యలు : కలెక్టర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణ సమీపంలోని చిన్న చెరువు కట్టపై వున్న పర్యాటక రెస్టారెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణను ఆదేశించారు. మంగళవారం చిన్న చెరువు ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రజలు సాయంత్రం వేళల్లో ఆహ్లాద వాతావరణంలో గడిపేందుకు చిన్న చెరువు కట్టపై రెస్టారెంట్‌ను పునరుద్ధరించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్ కో ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశంలో గుంతలు లేకుండా చదును చేసి పార్కింగ్‌కు అనుకూలంగా తీర్చి దిద్దాలన్నారు. సమీపంలోని సుంకులమ్మ దేవాలయం నుండి చిన్న చెరువు కట్ట మీదుగా రెస్టారెంట్ వరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ సూచించారు. రెస్టారెంట్ పరిధి ఇరువైపులా, ఖాళీ ప్రదేశంలో కూడా మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. రెస్టారెంట్‌కు చేరువలో ఉన్న చిన్న చెరువులో పిచ్చి మొక్కలు, వ్యర్ధ పదార్థాలు లేకుండా మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.










