
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు నాగసింధు కాన్పు కోసం వచ్చిన వారిని తాను నిర్వహిస్తున్న సొంత అసుపత్రికి రెఫర్ పేరుతో తీసుకెళుతుందన్న విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. వైద్య విధాన పరిషత్ డిసిహెచ్‌ఎస్‌కు ఆదేశాల మేరకు ధర్మవరం ఏరియా అసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు పద్మలతను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు విచారణ అధికారిణి పద్మలత హిందూపురం జిల్లా అసుపత్రిలో వైద్యురాలు నాగసింధు, వైద్య ఆరోగ్య సిబ్బందితో గురువారం విచారణ చేసి, రాత పూర్వకంగా సంజాయిషీ లేఖను తీసుకున్నారు. ఈ విచారణలో వీరితో పాటు ఆర్‌ఎంఒ రుక్మిణమ్మ పాల్గొన్నారు.
వైద్యులపై చర్యలు తీసుకోండి : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన గర్భిణులను రెఫర్ చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం విచారణ కోసం వచ్చిన విచారణ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహప్ప, నాగరాజు, సిపిఐ నాయకులు ఇస్మాయిల్, జబివుల్లా, వెంకటేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.