Oct 31,2023 18:19

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

రెఫర్‌ కేసులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురండి
- మెడికల్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులలో గుర్తించి రెఫర్‌ చేసిన కేసులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేషెంట్లను సంబంధిత ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మెడికల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులలో గుర్తించి రెఫెర్‌ చేసి పెండింగులో వున్న 3500 కేసులను ఏఎన్‌ఎం, వాలంటీర్ల ద్వారా సంబంధిత ఆసుపత్రులకు తరలించించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెడికల్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మిత్రలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకుండా సంబంధిత రిఫరల్‌ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌కు సూచించారు. 10 లక్షల మంది ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునే లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 1,64,449 మంది మాత్రమే డౌన్లోడ్‌ చేసుకున్నారని, లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవోలను ఆదేశించారు. ఆత్మకూరు, డోన్‌, మిడుతూరు, గడివేముల తదితర ప్రాంతాలలో తక్కువగా ప్రగతి ఉందని, సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలపై చర్యలు తీసుకోవాలని డిఎల్‌డివోకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో నిర్దేశించిన లక్ష్యం మేరకు డెలివరీలు జరగాలని, లేని పక్షంలో సంబంధిత మెడికల్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్యాపిలి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో లక్ష్యాన్ని మించి అత్యధిక డెలివరీలు చేసిన మెడికల్‌ అధికారిని సత్కరించాలని సూచించారు. ఎపి వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రి సిబ్బందితో భౌతిక సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బాలింతలను ఇంటికి చేర్చే ప్రగతి లక్ష్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కోఆర్డినేటర్‌ అధికారిని ఆదేశించారు. అర్హులైన రోగులందరికి ఆరోగ్యశ్రీ పరిధి కిందకి తీసుకొచ్చి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ రూపేంద్రనాథ్‌ రెడ్డిని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ డిఎంహెచ్వో డాక్టర్‌ శారదాభాయి, డిసిహెచ్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జఫ్రూళ్ల, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపర్డెంట్‌ వరప్రసాద్‌, డిఎల్‌డిఒ జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.