May 06,2022 06:50

      నాలుగు శాతంగా ఉన్న రేపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) 4.4 శాతానికి పెంచుతూ బుధవారంనాడు చేసిన నిర్ణయం ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బ్యాంకుల నుండి వాహన, వినిమయ రుణాల మొదలు గృహ నిర్మాణం, విద్య, వ్యవసాయాభివృద్ధి వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకునేవారిపై పెను భారం పడనుంది. దేశంలో అమాంతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుస్తుండటంతో అత్యవసరంగా సమావేశమై రెపో రేటు పెంచాల్సి వచ్చిందని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పుకొచ్చారు. వృద్ధి రేటు అవకాశాలను మెరుగుపర్చటం లేదా స్థిరీకరించాలన్న లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెపో రేటు పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అంటే ధరల పెరుగుదలను అరికట్టగలమనీ, దేశ ఆర్థిక వృద్ధిని పెంచగలమనీ ఆయన నమ్మబలికారు. ద్రవ్యోల్బణం పైకి ఎగబాకడానికి ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల. అది కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం వల్లనే తప్ప జనం మధ్య జరిగే ద్రవ్య చలామణీ వల్ల కాదని ఆర్‌బిఐ గవర్నర్‌కు తెలియదా? ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వెనుక విచ్చలవిడి దిగుమతులు, ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌, కార్పొరేట్‌ బడా సంస్థల భారీ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడమే కారణమన్న విషయం వారి ఎరుకలో లేదా? అసలు కారణాలను మభ్యపుచ్చి ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఇలాంటి వాదనలను ఏలికలు ముందుకు తెస్తున్నారన్నది కాదనలేని వాస్తవం.
      మోడీ మహాశయుడు ప్రధాని పీఠన్ని అధిష్టించిననాడు కేంద్ర పన్నులు లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.45, డీజిల్‌పై రూ.3.56గా ఉన్నవాటిని ఇప్పటికి వరుసగా రూ.32.95, రూ.31.81లకు పెంచారు. అలాంటి పెద్దమనిషి ఇటీవల కరోనా పరిస్థితిపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను తగ్గించుకోవాలని సలహానివ్వడం జనాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పైకి ఎగదోయడమే. ప్రధాని ఉవాచ, ఆర్‌బిఐ గవర్నర్‌ చెబుతున్న సాకులు పరిశీలిస్తే అది కుక్క పిల్ల అని పదే పదే చెప్పి బాటసారి నుండి మేక పిల్లను కొట్టేసిన దొంగల కథ గుర్తుకొస్తుంది కదా! ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ఇలాంటి వాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.
      రెపో రేటు పెంచడంవల్ల రుణ గ్రహీతలపై వాయిదాల చెల్లింపు (ఇఎంఐ) భారం పెరగనుంది. గృహ, వ్యక్తిగత, వాహన వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. వాయిదాల సంఖ్య పెరిగి సామాన్యులు మరింత కునారిల్లుతారు. ఇఎంఐల చెల్లింపుల్లో తొలి వాయిదాల్లో వడ్డీ సొమ్మును వసూలు చేసుకొని, ఆ తరువాత అసలు జమ వేసుకోవడం ద్వారా ఇది చక్ర వడ్డీని తలపిస్తుంది. కాబట్టి బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి, ఇకముందు తీసుకునేవారికీ రెపో రేటు పెంపుదల నిస్సందేహంగా భారమే! ఆర్థిక వ్యవస్థ పరిణామాలతో సంబంధం లేకుండా వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గాయని, తాజాగా వడ్డీ రేట్ల పెంపు వల్ల తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్న మాట ఆచరణకు నిలిచేదిగా లేదు. ఉన్న ఉపాధి కోల్పోయి లేదా క్షీణించినందున జనం వద్ద డబ్బు లేని దుస్థితి నెలకొంది. ఇక డిపాజిట్‌ చేసేదెవరు? ఏ కొద్దిమందికో వచ్చే రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు లేదా బాండ్ల మెచ్యూరిటీ డబ్బు మొత్తం సమాజానికంతటికీ వర్తించేది కాదు. వారికి సైతం బ్యాంకు డిపాజిట్లపై దక్కేది సాధారణ వడ్డీ మాత్రమే! నేడు నెలకొన్న ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చర్యలు తీసుకోవలసిందిపోయి, ప్రజల వద్దనుండి మరింత గుంజుకునే నిర్ణయాలు తీసుకోవడం తగదు. ఇది ఆర్థిక సంక్షోభం మరింతగా పెరగడానికే దారి తీస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను నెత్తికెత్తుకున్న ఈ కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనను అంతం చేయడం కోసం ఉద్యమించడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం.