Jul 08,2023 23:56

నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి -కోటవురట్ల:అణుకు గ్రామానికి పాఠశాల, రోడ్లు నిర్మాణం చేపట్టాలని గ్రామానికి వెళ్లే దారిలో గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు అప్పలరాజు, రేపాక మధుబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామస్తులు రోడ్డు, పాఠశాల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితిలో వైద్య సదుపాయం కూడా అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు, నాయకులు గిరిజన గ్రామ ప్రజలకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు డేవిడ్‌ రాజు, దళిత సంఘ నాయకులు చిట్ల చలపతి, యాదగిరి దాసు, గిరిజనులు పాల్గొన్నారు.