
ప్రజాశక్తి-అవనిగడ్డ : రెండు రోజుల్లో సాగునీరు పూర్తిస్థాయిలో విడుదల చేయకుంటే ఎండిపోయిన పంట పొలాల్లోనే దీక్ష చేస్తానని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ప్రభుత్వానికి అల్టి మేటం ఇచ్చారు. బుధవారం నాగాయలంక మండలం చర్లపల్లి గ్రామంలో పంట భూములను రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండిపోయి నెరలు కొట్టిన భూములను చూసి బుద్ధ ప్రసాద్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ఎద్దడి లేదని ప్రకటించిన జిల్లా కలెక్టర్ రెండు రోజులలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చివరి భూములకు సాగునీరు ఇవ్వకపోతే సరళగొంది గ్రామంలో ఎండిపోయిన పొలాల నుండే ఉద్యమం మొదలు పెడతామని బుద్ధ ప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేవారని నేడు ఏఈ డి ఈ లు కూడా కనిపించడం మానేశారు అన్నారు. 2000 క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం అరా కొరగా కేవలం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే వదులుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, నాగాయలంక మండల పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, అవనిగడ్డ నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు బావిరెడ్డి వెంకటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు.