పది కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ రంగాల్లో మార్చి 28, 29 తేదీల్లో సమ్మె జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మె ప్రభుత్వాలకు గట్టి సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వ్యతిరేక పోరాటంలో ఇదో మైలురాయిగా చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా దేశ వ్యాప్తంగా రక్షణ, రైల్వే రంగాల్లో వెయ్యి చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 14 మాసాల నుంచీ పోరాటం సాగుతోందనే విషయం మనకు తెలుసు. పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి విశాఖ స్టీల్‌పై ఇచ్చిన తప్పుడు ప్రకటనకు వ్యతిరేకంగా నూరు శాతం రెండు రోజుల సమ్మె చేసి గట్టి హెచ్చరిక చేశారు. తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులను అవమానించే విధంగా స్టీల్ ప్లాంట్ ఉత్పాదన లోపాల వల్ల విశాఖ స్టీల్‌లో నష్టాలు వస్తున్నాయని ప్రకటించారు. ఇది పచ్చి అబద్ధం. గత సంవత్సరం రూ.1298 కోట్లు రాగా, ఈ ఏడాది సుమారు రూ.650 కోట్లు లాభాలు వచ్చాయనేది వాస్తవం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి అమ్మాలనే దురుద్దేశంతోనే సొంత గనులు ఇవ్వడం లేదు. ఇదే పెద్ద సమస్య. దీనివల్ల గత సంవత్సరం విశాఖ స్టీల్ అదనంగా రూ.2000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. స్టీల్ మంత్రికి సమాధానంగా రెండు రోజుల సమ్మెతో కార్మికుల ఆగ్రహాన్ని ప్రభుత్వం సవిచూసింది. దేశవ్యాప్తంగా సమ్మె జరిగితే విశాఖ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం ప్రత్యేకం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేశాయి. రెండ్రోజుల బదులు ఒకరోజు మాత్రమే సమ్మె చేయాలని కొన్ని యూనియన్లు తీవ్రంగా ప్రచారం చేశాయి. సిఐటియు యూనియన్లు అన్ని చోట్లా తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండు రోజుల జీతాల నష్టం చూసుకుంటే పరిశ్రమలు ప్రైవేటుపరమైతే కార్మికులు జీవితాలే నాశనమవుతాయని అప్రమత్తం చేసింది.
విజయవాడ కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని హిందుస్తాన్ పెట్రోలియం, ఐఒసి, బిపిసిఎల్, కాంట్రాక్టు కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు సమ్మెలో పాల్గోడంతో యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఫిల్లింగ్ స్టేషన్లు సమ్మె ప్రభావంతో ఆగిపోయాయి. ఈ సమ్మె ప్రభావం ఆయిల్ సెక్టార్‌పై తీవ్రంగా కనిపించింది.
దేశవ్యాప్తంగా ఇన్స్యూరెన్స్ కార్మికులు నూరు శాతం సమ్మెలో పాల్గొన్నారు. 80 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులతోపాటు 12 లక్షల మంది ఏజెంట్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.32 లక్షల కోట్ల విలువ కలిగిన ఎల్‌ఐసి ని 5 శాతం వాటాలు అమ్మే నిర్ణయంపై కార్మికుల కోపాగ్నిని ఈ సమ్మె వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఎఐబిఇఎ, బెఫీ సమ్మెకు పిలుపునిచ్చాయి.
అయినా దేశవ్యాప్తంగా బ్యాంకులపై ఈ సమ్మె ప్రభావం గట్టిగానే ఉంది. భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలయిన విశాఖ స్టీల్, హిందుస్థాన్ షిప్‌యార్డు, హిందుస్థాన్ పెట్రోలియం, విశాఖ పోర్టుతో సహా అత్యధిక పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనడం విశేషం. హిందుస్థాన్ షిప్ యార్డులో 70 శాతం పర్మినెంట్ కార్మికులు సమ్మె చేయడంతోపాటు వంద శాతం కాంట్రాక్టు కార్మికులు మొదటి రోజు సమ్మె చేయడంతో పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. అప్పటి వరకూ డిఫెన్స్ ఆర్డినెన్స్ గురించి పట్టించుకోని యాజమాన్యం 28 రాత్రి 7 గంటలకు నాయకులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ప్రభావం యాజమాన్య ఆగ్రహానికి కారణమని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
29 మార్చి విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైల్వే డీఆర్‌ఎం ఆఫీసు నుంచి జరిగిన ర్యాలీ ప్రభుత్వ రంగ కార్మికులతోపాటు, ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఆటో, విఒఎ, ముఠా, బిల్డింగ్ తదితర రంగాల కార్మిక ప్రదర్శన, ర్యాలీ భవిష్యత్తు పోరాటాలకు విశ్వాసం కల్పించాయి. రెండు రోజులు కార్మికుల సమ్మెలో ఈ సారి కర్షక మైత్రి తోడైంది. సంయుక్త కిసాన్ మోర్చా 550 రైతు సంఘాల నాయకత్వం కార్మిక సమ్మెకు మద్దతు ఇవ్వడం, కార్మికవర్గానికి మరింత బలం తోడైంది.
సమ్మెతో మండల, గ్రామ స్థాయిలో నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరగడం ఈ సమ్మె ప్రత్యేకత. విద్యార్థి, యువజన, మహిళా సంఘాల తోడ్పాటు, శ్రమజీవులు ఒంటరి కాదని రుజువు చేశాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావం అన్ని రంగాల ప్రజలను వేధిస్తోంది. రెండు రోజుల సమ్మెతోనే సమస్యలు పరిష్కారం కావు. భవిష్యత్తులో బిజెపి విధానాలను తిప్పికొట్టేందుకు మరిన్ని ఉద్యమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
/ వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు/
సిహెచ్. నర్సింగరావు











