ప్రజాశక్తి-పాడేరు:అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి తెలియ జేయాలని జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో డిఆర్‌ఓ మాట్లాడుతూ, ఓటర్లను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులపై రెండు అదనపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, రెండు పేరు మార్పులకై సంబంధిత సహాయ ఎన్నికల అధికారులు ప్రతిపాదించారన్నారు. వీటిపై సమీక్ష అనంతరం హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి అరకు వేలి మండలంలో కంటబంసుగూడ 106 నెంబర్ పోలింగ్ బూత్‌కు అదనంగా 106ఎ బూత్‌ను ఏర్పాటు చేసి 1065 మంది ఓటర్లను కలిపా మన్నారు. పాడేరు మండలంలోని సుంద్రుపుట్టు పాఠశాలలో 109ఎ బూత్‌ను ఏర్పాటు చేసి 805 మంది ఓటర్లను కలిపామన్నారు.సుంద్రుపుట్టులో 109 పాఠశాలలో పోలింగ్ బూత్ నిర్వహించనున్న తరగతి గది మార్పు, కొయ్యూరులో 117 నంబర్ పోలింగ్ బూత్ కొయ్యూరు బదులుగా రాజేంద్రపాలెం అని తప్పుగా ఉన్నందున దానిని కొయ్యూరుగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై అవగాహన పెంచుకొని ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని డిఆర్‌ఓ కోరారు. ఈనెల 23న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని, 23వ తేదీ నుండి డిసెంబర్ 09 మధ్య క్లైమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారని, డిసెంబర్ 25న వాటిని పరిష్కరించడ జరుగుతుందన్నారు. తుది జాబితా 30వ తేదీన ప్రకటించటం జరుగుతుందని డిఆర్‌ఓ వివరించారు.ఈ సమావేశంలో వైఎస్సార్ సిపి తరుపున ఎస్.మంగలన్న దొర, టిడిపి నుంచి కే.వి సురేష్ కుమార్, కే.కృష్ణారావు, సిపిఎం నుంచి పాంగి లక్కు, వి.ఉమామహేశ్వరరావు, బిజెపి నుంచి పాంగి రాజారావు, కే.కృష్ణారావు, కే.ఆనంద రావు, కాంగ్రెస్ నుంచి కృష్ణారావు, తహసిల్దార్, వి.త్రినాధరావు నాయుడు పాల్గొన్నారు.










