ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నియోజకవర్గాల్లో అభివృద్ధికి సహకారం అందిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రస్తావించిన అంశాలు, సమస్యలపై మంత్రి మాట్లాడారు. మాచవరం, తంగెడలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు చర్యల కోసం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో 22ఎ ల్యాండ్ జాబితా నిషేదిత భూముల తొలగించే విధానంలో అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గొట్టిముక్కలలో సుమారు 150 మందికి సంబంధించిన అసైన్‌మెంట్ భూముల కేటాయింపు చేపట్టాలన్నారు. దాచేపల్లిలో తొలివిడత 800 పట్టాలు త్వరగా అందించాలని చెప్పారు. మాడుగలలో 48 మందికి సంబంధించి సుమారు 80-90 ఎకరాలు అసైన్డ్ భూముల పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరి ంచాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద వచ్చిన పలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీల శ్మశానవాటిక సమస్యను పరిష్కరి ంచాలని, గురజాలలో 24 గంటలు విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మాచర్ల నియోజకవర్గ స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ అనుమతులు లేని ప్రైవేట్ లే ఔట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు జర్రివాగు వాటర్ స్కీంకు మరమ్మతులు చేసి పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరాకు ఆదేశించారు. జలజీవన్ మిషన్ పనులుకు త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సంపూర్ణ నివేదిక అందుబాటులో ఉంచాలన్నారు. మాచర్లలో డిగ్రీ కాలేజికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్ట్, డెంటిస్ట్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరవనం ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎస్పీ వై.రవిశంకరరెడ్డి, జెసి ఎ.శ్యాంప్రసాద్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










