ప్రజాశక్తి-విజయనగరం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివద్ధి పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి చేర్చడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ మాథుర్ చెప్పారు. నవంబరు మూడో వారంలో జిల్లాలో ఈ యాత్ర ప్రారంభమై రెండు నెలలపాటు జనవరి 26వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ యాత్ర నిర్వహణకోసం జిల్లా ప్రభరీ అధికారిగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారుల కమిటీతో సమావేశమయ్యారు. కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చైతన్య పరచడం, అర్హులె ఉండి పథకాలు పొందలేని వారిని గ్రామాల్లో జరిగే యాత్ర సందర్భంగా గుర్తించి వారికి ఆయా పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అర్హులైన వారికి అవసరమైన డాక్యుమెంట్లు లేని పక్షంలో వాటిని సమకూర్చి పథకాలు మంజూరు చేయడంలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని కోరారు.ఉజ్జ్వల యోజన పథకం కింద జిల్లాలో ఇంకా అర్హులైన వారు మిగిలి వుంటే ఈ యాత్రలో భాగంగా వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్‌పిసిఎల్ అధికారి శ్రీహర్షను ఆదేశించారు. జిల్లాలో యాత్రకు చేసిన ఏర్పాట్లను జిల్లా స్థాయి నోడల్ అధికారి, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్ ద్వారా తెలుసుకున్నారు. సమావేశంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, జిల్లా అదనపు ఎస్‌పి అస్మా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తో భేటీ అయ్యారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు.