ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని తీర ప్రాంతంలో మళ్లీ అలజడి రేగింది. రామాపురం, కటారిపాలెం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు రెండు గ్రామాలలో పోలీసు బలగాలను మోహరించే ఉన్నారు. ఈ సంఘటన శనివారం తీర ప్రాంత గ్రామాలలో అలజడి చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు తీర ప్రాంత 103 గ్రామాల మత్స్యకార పెద్దలు కటారిపాలెంలో రెండు గ్రామాల పెద్దలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో రామాపురం గ్రామాన్ని తమ సామాజికవర్గంలో కలుపుకోవాలని ప్రతిపాదించారు. గత నాలుగేళ్ల క్రితం నుంచి ఈ రెండు గ్రామాల మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలలో రామాపురం గ్రామానికి చెందిన కాటం గారి అంకయ్య, వాయిల వెంకటేశ్వర్లుపై కటారిపాలెం గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అంకయ్య, వెంకటేశ్వర్లు చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కటారిపాలెం రామాపురం గ్రామాలలో పెద్దలతో సమావేశం అయ్యారు. కటారిపాలెం గ్రామస్తులు రామాపురం ఊరిపై దాడి చేయాల్సిందే అంటూ భీష్మించుక్కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జిల్లా కేంద్రంలో సమాచారం అందించి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. రెండు గ్రామాలలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. 13 గ్రామాల పెద్దలు మాత్రం రెండు గ్రామాలలో శాంతి వాతావరణం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చీరాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సీఐ మల్లికార్జునరావు వేటపాలెం ఎస్సై జి సురేష్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాత్రం పాత్రికేయుల ఫోన్లను ఎత్తకపోవడం గమనర్హం ఏది ఏమైనా గత నాలుగేళ్ల నుంచి రెండు గ్రామాల మధ్య రాజకీయ నాయకుల అండ దండలతో పాత కక్షలు నివురు గప్పిన నిప్పులా మారాయి. ఈ ఉద్రిక్తత ఇదే విధంగా కొనసాగితే తీర ప్రాంత గ్రామాలలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఎంతైనా ఉన్నదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులు రెండు గ్రామాల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పే విధంగా తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.










